Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు
IMD declares formation of cyclone 'Kyarr' over Arabian Sea (Photo Credits: PTI)

Mumbai, October 26: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రత్నగిరి ప్రాంతం నుంచి తుఫాను ఒమన్ తీరం వైపు కదులుతోందని, రత్నగిరి జిల్లాకు భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలల పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి.

అక్టోబర్ 28 నుంచి 31 వరకు ప్రజలు క్యార్ తుఫాను నుంచి అప్రమత్తతతో ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.

క్యార్ ముప్పు ముంచుకొస్తోంది

క్యార్ ప్రభావంతో కర్నాటక గోవా తీరప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 12 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్యార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో సింధుదుర్గ్ జిల్లాకు 204.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇక శనివారం రోజున మరింత పెరిగి గంటకు 110 కిలోమీటర్ల వేగంను అందుకుంటాయని వాతావరణశాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. దాదాపు 6వేల హెక్టార్ల వరిపంట నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతుండడంతో గొట్టా బ్యారేజీ 22గేట్లు ఎత్తివేశారు. పెదరోకలపల్లి రహదారి వంతెనపై నుంచి వరద ప్రవహించింది. రెంటికోట గ్రామం వద్ద కాలువ గట్లు తెగిపడటంతో ఆంధ్రా, ఒడిశా మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి.

నాగార్జున సాగర్‌ 20 క్రస్ట్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 5.77 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 6.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5.1 లక్షలు, ఔట్‌ఫ్లో 6.17 లక్షల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211.95 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. 42 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

భారీవర్షాల కారణంగా విజయనగరం రైల్వేస్టేషన్‌ యార్డులో నీరు నిలిచిపోవడంతో ట్రాక్‌ సర్క్యూట్లు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. విశాఖలో గురువారం బయలుదేరాల్సిన విశాఖపట్నం-బెర్హంపూర్‌ పాసింజర్‌, శుక్రవారం బెర్హంపూర్‌- విశాఖపట్నం పాసింజర్‌, విశాఖలో గురువారం బయలుదేరాల్సిన విశాఖపట్నం-భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, శుక్రవారం భువనేశ్వర్‌లో బయలుదేరాల్సిన భువనేశ్వర్‌-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా జరిగిన పలు ఘటనల్లో ముగ్గురు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోయిందని వారు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కోస్తా, దక్షిణ, మధ్య ఒడిషా ప్రాంతాలకు చెందిన 8 జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉందని, 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వరదలు సంభవించే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగానికి స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ ప్రదీప్‌ జేనా సూచించారు. సైక్లోన్‌కు సంబంధించి వస్తున్న పుకార్లను నమ్మద్దని ప్రజలను కోరారు. ముందస్తు చర్యలుగా 11 జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు మూసివేశారు.