Hyderabad Nawabs: భాగ్యనగరంలో అపర భాగ్యవంతులు, ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది హైదరాబాదీలు,  ఫార్మా రంగం నుంచే నగరానికి చెందిన ఏడుగురు బిలియనీర్లు
Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, March 3: పెట్టుబడులను ఆకర్శించడం, సంపదలను పెంచడంలోనే కాకుండా బిలియనీర్లను కూడా సృష్టిస్తూ హైదరాబాద్ నిజంగా భాగ్యనగరం అనిపించుకుంటుంది. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారతదేశంలో మరో 40 మంది బిలియనీర్లు తయారయ్యారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 యొక్క తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో 10 మంది బిలియనీర్లు హైదరాబాద్ నుంచే ఉండటం మరో విశేషం. 15 జనవరి, 2021 నాటికి వీరి సంపద 1,65,900 కోట్ల రూపాయలు (22.6 బిలియన్ డాలర్లు) గా పేర్కొంది.

హైదరాబాద్ నుంచి ఉన్న ఈ 10 మంది బిలియనీర్లలో ఏడుగురు ఫార్మా రంగానికే చెందిన వారు కాగా, మరో ముగ్గురు రియల్ ఎస్టేస్ట్స్ రంగానికి చెందిన వారు ఉన్నారు. దివిస్ లాబొరేటరీస్ కు చెందిన మురళి దివి మరియు ఫ్యామిలీ 54,100 కోట్ల రూపాయల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో అయితే 20వ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 385వ స్థానంలో నిలిచారు.

అరబిందో ఫార్మాకు చెందిన పివి రాంప్రాసాద్ రెడ్డి మరియు కుటుంబం రూ .22,600 కోట్ల నికర విలువతో రెండో స్థానంలో, వారు భారతదేశంలో 56వ స్థానం మరియు ప్రపంచవ్యాప్తంగా 1,096 స్థానంలో ఉన్నారు.

హెటెరో డ్రగ్స్ కు చెందిన బి పార్థసారధిరెడ్డి 16,000 కోట్ల రూపాయల నికర విలువతో భారతదేశం నుండి కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు దేశ కుబేరుల్లో వీరి ర్యాంక్ 83గా ఉండగా ప్రపంచవ్యాప్తంగా 1,609 స్థానంలో ఉన్నారు.

ఇక డాక్టర్ రెడ్డీస్ కు చెందిన కె సతీష్ రెడ్డి భారతదేశంలో 108 స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 2,050 ర్యాంకుతో నిలిచారు. వీరి నికర విలువ 12,800 కోట్ల రూపాయలు.

డాక్టర్ రెడ్డీస్ నుంచి మరో కుటుంబం జివి ప్రసాద్ మరియు జి అనురాధ భారతదేశంలో 133వ ర్యాంక్ మరియు ప్రపంచవ్యాప్తంగా 2,238 స్థానంలో ఉన్నారు, వీరి నికర విలువ రూ .10,700 కోట్లు.

మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అధినేత పి.పిచ్చి రెడ్డి నికర సంపద రూ .10,600 కోట్లతో భారతదేశంలో 134 వ స్థానంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానంలో ఉన్నారు.

రామేశ్వర్ రావు జుపల్లి (మై హోమ్ ఇండస్ట్రీస్) రూ .10,500 కోట్ల నికర సంపదతో భారతదేశంలో 138, ప్రపంచవ్యాప్తంగా 2,383 స్థానంలో ఉన్నారు.

పి.వి కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) రూ .10,200 కోట్ల నికర సంపదతో భారతదేశంలో 140 మరియు ప్రపంచవ్యాప్తంగా 2,383 స్థానంలో కొనసాగుతున్నారు.

ఎం. సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్ఎన్ లాబొరేటరీస్) నికర సంపద రూ .9,800 కోట్లతో భారతదేశంలో 143, ప్రపంచవ్యాప్తంగా 2,530 ర్యాంకులతో కొనసాగుతున్నారు.

వీసీ నన్నపనేని (నాట్కో ఫార్మా) నికర సంపద రూ .8,600 కోట్లతో భారతదేశంలో 164, ప్రపంచవ్యాప్తంగా 2,686 ర్యాంకు వద్ద కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే, రిలయన్స్ చీఫ్ ముఖేష్ అంబానీ 6.05 లక్షల కోట్ల నికర సంపదతో బిలియనీర్ జాబితాలో భారతదేశం నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. జనవరి నాటికి ముఖేష్ అంబానీ నెట్ వర్త్ 6,05,900 కోట్లు (83 బిలియన్ డాలర్లు) పెరిగి ఆసియాలో నెం.2గా, మొత్తం ప్రపంచంలో 8వ స్థానంలో కొనసాగుతున్నారు.

అంబానీ తర్వాత అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ, హెచ్‌సిఎల్‌కు చెందిన శివ నాదర్, ఆర్సెలర్ మిట్టల్‌కు చెందిన లక్ష్మి ఎన్ మిట్టల్, సీరంకు చెందిన సైరస్ పూనవల్లా ఉన్నారు. ఏడాదిలో గౌతమ్ అదానీ సంపద దాదాపు రెట్టింపు చెంది 32 బిలియన్ డాలర్లకు చేరుకుందిఅదానీ గ్రీన్ ఎనర్జీ విలువ 20 బిలియన్ డాలర్లకు పెరిగింది.