New Delhi, July 9: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు కొంత బాసటగా నిలుస్తుంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్‌వో ఒక సర్క్యులర్ జారీ చేసింది.
కరోనావైరస్ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు ఈపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు.
అయితే, ఈ రూ. లక్ష అడ్వాన్స్ పొందేందుకు ఈపీఎఫ్ మెంబర్ లేదా తన కుటుంబంలో నుంచి ఎవరైనా పేషెంట్ మరియు ఆసుపత్రి వివరాలతో వినతిపత్రం సమర్పించాల్సి ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మరో ముఖ్య ప్రకటన ఈపీఎఫ్ నుంచి వెలువడింది. ఈపీఫ్ నెంబర్- ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవడం తప్పనిసరిగా పేర్కొంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) పిఎఫ్ బెనిఫిట్స్ పొందడానికి ఆధార్ కార్డును పిఎఫ్ యుఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) తో లింక్ తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించిన గడువును 2021 జూన్ 1న ముగిసిపోగా, కరోనా నేపథ్యంలో గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 1 వరకు పొడగించారు.
ఈ కొత్త నిబంధనను అమలు చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత 2020 కోడ్ 142 సెక్షన్‌ను సవరించింది. పాన్ మరియు ఆధార్ కార్డ్ లింక్ అన్ని బ్యాంకులు, పిపిఎఫ్ ఖాతాలు మరియు ఇపిఎఫ్ ఖాతాల యొక్క ప్రాథమిక 'నో యువర్ కస్టమర్' (కెవైసి) అవసరం.