New Delhi, September 25: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM- Kisan Samman Nidhi) ద్వారా రైతుల ఖాతాల్లోకి మూడవ విడత నిధులు చేరుతున్నాయి. ఈ పథకం కింద అర్హులైన ఒక్కో రైతుకి రూ. 2 వేలు లభించనున్నాయి. మంగళవారం రోజు 2.80 లక్షల రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కాబడ్డాయి, మిగతా రైతులకు కూడా మరో రెండు, మూడు రోజుల్లో మూడో విడతలో వారికి రావాల్సిన నిధులు జమచేయబడతాయని సమాచారం.
భూములున్న ప్రతీ రైతు ఈ పథకానికి అర్హుడవుతాడు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ చెల్లింపు దారులు మరియు రూ. 10 వేల పైబడి పెన్షన్ అందుకునే వారికి ఈ పథకం వర్తించదు.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా తమ ఖాతాల్లో నిధులు జమ కాబడ్డాయా? లేదా? స్టేటస్ ఏంటో ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా రిజస్టర్ చేసుకోబడిన మొబైల్ నెంబర్ ద్వారా ఈ మూడు విడతల్లో ఎంత మొత్తం జమకాబడ్డాయి? తాజా స్థితి ఏంటి అనేది ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు - http://www.pmkisan.gov.in/BeneficiaryStatus.aspx.
ఏపీలో రుణమాఫీ ఉత్తర్వులు రద్దు
మరోవైపు చంద్రబాబు హయాంలో ఇవ్వబడిన రుణమాఫీ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. రైతులకు 4-5 విడతల్లో అందించాల్సిన రుణ మాఫీ నిధులు రూ. 7959.12 విడుదల చేస్తూ గత మార్చి నెలలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 38 జారీ చేసింది. తాజాగా ఈ జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలవుతున్న నేపథ్యంలో పాత జీవోను రద్దు చేశారు.
రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని బ్యాంకర్ల సమావేశంలో భాగంగా సీఎం జగన్ స్పష్టం చేశారు.