Hyderabadi Diplomats Leading India at UN: ఐరాస వేదికపై హైదరాబాదీలు! ఏ విషయాన్నైనా సూటిగా, సుత్తి లేకుండా భారత వాణిని ధాటిగా వినిపిస్తారు. జమ్మూకాశ్మీర్ విషయంలోనూ దేశం మాటను బలంగా చాటి చెప్తున్నారు.
Indian Diplomats at UN who rooted from Hyderabad.| (Photo Credits: Getty, Instagram)

గతవారం జమ్మూకాశ్మీర్ అంశంపై ఐరాస భద్రతామండలి అంతర్గత సమావేశం అనంతరం భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేరు దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపించింది. జమ్మూకాశ్మీర్ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన పాకిస్థాన్, చైనా దేశాలు UNSCతో ఒక అనధికార సమావేశాన్ని నిర్వహింపజేసుకొని ఘోరంగా భంగపడ్డాయి. ఆ సమావేశానంతరం చైనా, పాకిస్థాన్ ప్రతినిధులు మీడియా ఎదుట మొక్కుబొడిగా తాము చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు. అయితే సయ్యద్ అక్బరుద్దీన్ మాత్రం భారత వాణిని చాలా స్పష్టంగా తెలియజెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఎక్కడా తొణకకుండా బదులిచ్చారు. పాకిస్థాన్ జర్నలిస్టులతో కరచాలనం చేస్తూ వారితో చమత్కారంగా మాట్లాడారు.

తాజాగా, కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ కోర్టులో తేల్చుకుంటామని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ స్పందించారు. పాకిస్థాన్ వారు ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారు. వారు ఇంకా ఇతర వేదికలపైనా తమని ఎదుర్కోవాలని భావించినా సరే, అదే వేదికపైన వారి వాదనలను బలంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.

అక్బరుద్దీన్ తో పాటు మరో ముగ్గురు తెలుగువారు ప్రస్తుతం ఐక్యరాజ్య సమతిలో భారత తరఫున కీలక బాధ్యతలను నిర్వహిస్తూ,  దేశం వాణిని బలంగా వినిపిస్తున్నారు.

ఇందులో మొదటగా సయ్యద్ అక్బరుద్దీన్ గురించి చెప్పాలంటే ఆయన ఐరాసలో భారత తరఫున శాశ్వత ప్రతినిధి, 1986 IFS (Indian Foreign Service) బ్యాచ్. తన వాక్చాతుర్యంతో, తన సమయస్పూర్థితో అంతర్జాతీయ వేదికలపై భారత వాదనలను సమర్థవంతంగా వినిపించి ఎన్నో విజయాలను అందించారు. ప్రస్తుతం ఆర్టికల్ 370 వ్యవహారాన్ని కూడా ఆయనే డీల్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ అక్బరుద్దీన్ ఎక్కడివాడో కాదు పక్కా మన హైదరాబాదీనే. ఆయన భార్య పేరు పద్మ. 1960, ఏప్రిల్ 27న హైదరాబాద్ లో పుట్టారు. ఆయన తండ్రి బషీరుద్దీన్ ఉస్మానియా యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం విభాగానికి 'హెచ్ఓడీ' గా పనిచేశారు, బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసీగా వ్యవహరించారు. ఆ తర్వాత ఖతార్ దేశంలో భారత రాయబారిగా కూడా సేవలందించారు. తల్లి జీబా బషీరుద్దీన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్.

అక్బరుద్దీన్ చదువు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సాగింది. ఉస్మానియా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్.

కాకనూర్ నాగరాజు

అక్బరుద్దీన్ తర్వాత రెండో వరుసలో నిలిచేది కాకనూర్ నాగరాజు, ఈయన ఐరాసలో డిప్యూటీ శాశ్వత సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 1998 IFS బ్యాచ్. నాగరాజు హైదరాబాద్ నిజాం కాలేజీలో బి.ఎ డిగ్రీ పూర్తి చేశారు , ఆ తర్వాత న్యాయ మరియు దౌత్య శాస్త్రంలో పీజీని అమెరికాలో పూర్తిచేశారు.

నాగరాజు 11 సంవత్సరాలు చైనాలో భారత సెక్రెటరీగా సేవలందించారు. ఈయన చైనీస్ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. గతంలో ఎన్నోసార్లు జమ్మూకాశ్మీర్ అంశంలో భారత స్టాండ్ ను బలంగా ప్రెజెంట్ చేశారు.

సందీప్ కుమార్ బయ్యపు , ఈయన 2007 IFS బ్యాచ్. సందీప్ స్వస్థలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లిలోని ఖాజీపల్లి గ్రామం. ఈయన విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ లోనే సాగింది. ఐరాసలో భారత సెక్రెటరీగా వ్యవహరిస్తున్న సందీప్, శాంతి పరిరక్షణ, మానవ హక్కులు వంటి వ్యవహారాలను డీల్ చేస్తారు.

రాజా కార్తికేయ.

ఐరాసలో భారత తరఫున సేవలందిస్తున్న మరో హైదరాబాదీ రాజా కార్తికేయ. ఈయన ఐరాసలో రాజకీయ అంశాల విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. కార్తికేయ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివారు. ఈయన తండ్రి ఒక సీనియర్ జర్నలిస్ట్.