Image of Drone | Photo: Wikimedia Commons

New Delhi, July 16:  ఈ కాలంలో డ్రోన్ లు ఎగరవేయడం ప్రతిచోటా సర్వసాధారణమైపోయింది. డ్రోన్ కు కెమెరా ఫిక్స్ చేసి అందంగా వీడియోలు చిత్రీకరించడం దగ్గర్నించి, రక్షణపరమైన అవసరాలు, వ్యవసాయ సంబంధింత అవసరాలు లేదా సరదా కోసం కూడా డ్రోన్లను విరివిగా వాడుతున్నారు. అయితే సాధారణ ప్రజలు ఈ డ్రోన్లు ఎగరేయాలంటే ఎన్నో రకాల పర్మిషన్లు తీసుకోవాలి, మరెన్నో నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రోన్ల వినియోగంపై ఉన్న నిబంధనలపై చాలా వరకు సడలింపులు కల్పించాలని నిర్ణయించింది. భద్రతాపరమైన జాగ్రత్తలకు లోబడి డ్రోన్ల ఎగరవేతపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది, ఇందుకోసం నూతన నిబంధనలను విమానయాన శాఖ రూపొందించింది.

నూతనంగా రూపొందించిన డ్రోన్ల నిబంధనల 2021 ముసాయిదాను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నమ్మకం, స్వీయ నియంత్రణ, పరిమిత స్థాయిలో పర్యవేక్షణ ఉండే విధంగా వీటిని రూపొందించారు. డ్రోన్ల ఎగరవేతపై ఇదివరకు ఉన్న యూఏఎస్ (Unnamed Aerial System) నిబంధనల స్థానంలో నూతన డ్రోన్ల నిబంధనలు 2021 అమలులోకి వస్తాయి. వీటిపై 2021 ఆగస్ట్ 5వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించనున్నారు.

డ్రోన్ నిబంధనలు 2021 రూపొందించడానికి పరిగణనలోకి తీసుకున్న ముఖ్య అంశాలు :

 

1. అనుమతుల రద్దు: యునీక్ ఆథరైజేషన్ నంబర్, యునీక్ ప్రోటోటైప్ ఐడెంటిఫికేషన్, ధృవీకరణ పత్రం, నిర్వహణ ధృవీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్ అండ్ డి సంస్థ నుంచి అనుమతి , విద్యార్థి రిమోట్ పైలెట్ లైసెన్స్, రిమోట్ పైలట్ బోధకుని నుంచి , డ్రోన్ పోర్ట్ ఆథరైజేషన్ మొదలైనవి అవసరం లేదు.

2. పత్రాల సంఖ్య 25 నుంచి ఆరుకి తగ్గింపు

3. డ్రోన్ పరిమాణంతో సంబంధం లేకుండా తక్కువ మొత్తంలో ఫీజు.

4. ‘నో పర్మిషన్- నో టేకాఫ్’ (ఎన్‌పిఎన్‌టి), రియల్ టైమ్ ట్రాకింగ్ బెకన్, జియో-ఫెన్సింగ్ వంటి భద్రతా అంశాలను ఖరారు చేయడం ఆరు నెలల గడువు లభిస్తుంది.

5. వ్యాపార-స్నేహపూర్వకంగా ఉండే విధంగా సింగిల్ విండో ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయబడుతుంది.

6. డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో కనీస వ్యక్తిగత కార్యకలాపాలు ఉంటాయి. అనుమతులలో ఎక్కువ భాగం స్వీయ-ఉత్పత్తి చేయబడతాయి.

7. డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో గ్రీన్ , ఎల్లో మరియు రెడ్జో న్లతో ఇంటరాక్టివ్ గగనతల మ్యాప్ ప్రదర్శించబడుతుంది.

8. విమానాశ్రయ చుట్టుకొలతలో ఎల్లో జోన్ 45 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లకు కుదించబడుతుంది.

9. గ్రీన్ జోన్లలో 400 అడుగులు, విమానాశ్రయం నుంచి ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు ఫ్లైట్ పర్మిషన్ అవసరం ఉండదు.

10. చిన్న డ్రోనులు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోనులు మరియు ఆర్ అండ్ డి సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం ఉండదు.

11. భారతదేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదు.

12. డ్రోన్లు మరియు డ్రోన్ భాగాల దిగుమతిని డిజిఎఫ్‌టి నియంత్రిస్తుంది.

13. ఏదైనా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ జారీకి ముందు భద్రతా అనుమతి అవసరం ఉండదు.

14. ఆర్‌అండ్‌డి సంస్థలకు ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్, ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, ముందస్తు అనుమతి మరియు రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం ఉండదు.

15. డ్రోన్ నిబంధనల 2021 పరిధిలోకి వచ్చే డ్రోన్ల బరువును 300 కిలోల నుండి 500 కిలోలకుపెంచడం జరిగింది. ఇది డ్రోన్ టాక్సీలను కూడా వర్తిస్తుంది.

16. డ్రోన్ శిక్షణ మరియు పరీక్షలు అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలలను పర్యవేక్షణ మరియు ఆన్‌లైన్‌లో పైలట్ లైసెన్స్‌ల జారీ అంశాలను డీజీసీఎ అమలు చేస్తుంది.

17. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ ను జారీ చేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా దాని ఆమోదం పొందిన సంస్థలు కలిగి ఉంటాయి.

18. తయారీదారు స్వీయ-ధృవీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో వారి డ్రోన్ కు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను రూపొందించవచ్చు.

19. డ్రోన్‌ల బదిలీ మరియు రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియ అమలులోకి వస్తుంది.

20. వినియోగదారుల స్వీయ పర్యవేక్షణ కోసం డిజిటల్ స్కై ప్లాట్‌ఫాంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, శిక్షణా విధానం కార్యక్రమాన్ని డీజీసీఎ నిర్ణయిస్తుంది. సూచించిన విధానాల నుంచి గణనీయమైన మార్పులు ఉంటే తప్ప ఆమోదాలను పొందవలసిన అవసరం ఉండదు.

21. డ్రోన్ నిబంధనల ప్రకారం విధించే గరిష్ట జరిమానాను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. అయితే, ఇతర చట్టాల ఉల్లంఘన కు సంబంధించి జరిమానాలకు ఇది వర్తించదు.

22. సరకు రవాణా కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయబడతాయి.

23. వ్యాపార-స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది.

ఈ నూతన నింబంధనలు అమలు చేయడానికి మరికొంత సమయం పడుతుంది. వీటిపై నిపుణుల మరియు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిబంధనలు ఖరారైన తర్వాత ప్రస్తుతం ఉన్న నిబంధనల స్థానంలో ఈ నూతన నిబంధనలను నోటిఫై చేస్తారు.