New Delhi, September 6: ఈ వారంలో సౌత్ ఇండియాని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం (Monsoon 2021 Forecast) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rainfall to Lash South India) ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే నార్త్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (India Meteorological Department (IMD) తెలిపింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంవల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఇక గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరంలో 15సెం.మీ, పూసపాటిరేగలో 14.3 సెం.మీ, డెంకాడలో 14.2, కొప్పెర్లలో 13.5, గోవిందపురంలో 12.8, నెల్లిమర్లలో 12.2, రాంబిల్లిలో 10.9, పైడి భీమవరంలో 10.8, కె.కోటపాడులో 9.5, బొందపల్లిలో 8.7, భోగాపురంలో 8.4, మారికవలస, భీమిలిలో 8.3, ఎల్.ఎన్.పేటలో 8.1, కొయ్యూరులో 7.8, విశాఖ రూరల్, దేవరాపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో జోరుగా కురిసిన వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పోశాయి. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం గాలులతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..రుతు పవనాల గాలుల ద్రోణి…ఢల్లీ, బాలంగీర్, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది.
సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ప్రభావంతో… మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడ లోతట్టుప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.