Flight | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, February 26: ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని ఇప్పటికీ ఎంతో మంది అనుకుంటారు. చాలా మంది సామాన్యులకు విమాన ప్రయాణం అనేది ఒక కల.  దేశంలో కోవిడ్ వ్యాప్తి కంటే ముందు దేశీయ విమానయాన ధరలు కొంతవరకు సామాన్యులకు సైతం అందుబాటులోనే ఉండేవి.  విమానయాన సంస్థలు పోటీపడుతూ ఎన్నో డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించేవి.  అయితే కరోనా లాక్డౌన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రయాణాలు లేక విమానయాన సంస్థలు భారీగా నష్టపోయాయి. కరోనావైరస్ మహమ్మారి వల్ల కలిగిన నష్టాలను రాబట్టడానికి విమానయాన సంస్థలు తమ ఛార్జీలను పెంచక తప్పలేదు. దీంతో విమాన ప్రయాణం ఇప్పుడు మరింత ఖరీదైపోయింది.

అయితే, చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు దేశీయ విమాన ప్రయాణం అందుబాటు ధరల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి లగేజ్ లేకుండా ప్రయాణించే వారి కోసం డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లలో రాయితీలు లభించనున్నాయి.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం చెక్-ఇన్ బ్యాగులు లేకుండా దేశీయంగా ప్రయాణించేవారి కోసం టికెట్ ధరల్లో డిస్కౌంట్ లభించనుంది. ఎలాంటి చెక్ ఇన్ లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ సామాను మాత్రమే తీసుకెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరలలో ఇప్పుడు రాయితీలు ఇవ్వడానికి దేశీయ ఫ్లైట్ ఆపరేటర్లకు అనుమతి ఇచ్చినట్లు డిజిసిఎ ఒక ప్రకటనలో తెలిపింది.

DGCA Circular: 

"ఎయిర్లైన్స్ లగేజీ పాలసీలో భాగంగా, ముందుగా షెడ్యూల్ చేయబడిన ఎయిర్ లైన్స్ లలో 'జీరో లగేజ్ ఛార్జీలు' కల్పించడానికి అనుమతించబడతాయి. జీరీ లగేజ్ ఛార్జీల పథకం కింద ప్రయాణీకుల టికెట్ బుకింగ్ చేసుకునేటపుడు తమతో ఎలాంటి లగేజ్ తీసుకెళ్లడం లేదని నిర్ధారించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ప్రయాణానికి అయ్యే టికెట్ ధరలో లగేజీ ఛార్జ్ తీసివేయబడుతుంది. అయితే ఒకవేళ ప్రయాణికుడు లగేజీ ఛార్జ్ లేకుండా టికెట్ బుక్ చేసుకుని, ఆ తర్వాత లగేజీతో విమానాశ్రయానికి వెళ్తే బోర్డింగ్ పాస్ ఇచ్చే కౌంటర్ వద్ద తిరిగి లగేజీ ఛార్జీలు వర్తింపజేయబడతాయని ఏవియేషన్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది.