SBI Ladakh Branch : ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎస్‌బీఐ సాహసం, కాశ్మీరీల కోసం లడఖ్‌లో బ్రాంచీ ఏర్పాటు, 10వేల 400 అడుగుల ఎత్తున కార్యకలాపాలు ప్రారంభం
SBI Started 14th branch at 10,400 feet in Ladakh

Ladakh, September: ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా భగ్గమంటున్నాయనే సంగతి అందరికీ విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కాశ్మీరల కోసం పెద్ద సాహసమే చేసింది. లడఖ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 10,400 అడుగుల ఎత్తులో తన బ్రాంచీని ఏర్పాటు చేసింది. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లోని నుబ్రా వ్యాలీ లోయలో ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ శాఖను ప్రారంభించారు. కాగా లడఖ్‌ను ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే.

కేవలం ఆరు వేల మంది జనాభా ఉన్న నుబ్రా వ్యాలీ భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లోని లెహ్ లోని తుర్ తుక్ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చైనా సరిహద్దుల్లో గల సియాచిన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మిగత బ్యాంకులు కనీసం ఈ ప్రాంతంలో శాఖను ఏర్పాటు చేయడానికి కూడా సాహసించని పరిస్థితుల్లో ఎస్‌బీఐ ధైర్యంగా ముందుకెళ్లడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఈ శాఖ లడఖ్ రీజియన్‌లో 14వ శాఖగా, మొత్తం మీద బ్యాంకు 22,024వ శాఖగా అవతరించింది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, లడఖ్‌లలో ఎస్‌బీఐకి 185 శాఖలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం లేదా రీజియన్ లీడ్-బ్యాంక్‌ను కలిగి ఉంటుంది. రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్‌గా రాష్ట్రం లేదా రీజియన్‌లో అవసరమయిన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండే బాధ్యతను లీడ్-బ్యాంక్ నెరవేరుస్తుంది. ప్రస్తుతం జేఅండ్‌కే బ్యాంక్ జమ్మూకాశ్మీర్, లడఖ్‌లకు లీడ్-బ్యాంక్‌గా వ్యవహరిస్తోంది.

బ్యాంకు శాఖను ప్రారంభించిన ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్:

సుదూర ప్రాంతంగా ఉన్న ఇక్కడి ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను అందించి ఆర్థికంగా పరిపుష్టి కలిగించే ఉద్దేశంతో ఎస్‌బీఐ తన శాఖను ఏర్పాటు చేసింది. మిగతా బ్యాంకులు ఊహించని ప్రదేశాల్లో ఎస్బీఐ తన శాఖలను విస్తరించిందని, సుదూర కొండప్రాంతాల్లోని వారికి కూడా మొక్కవోని సంకల్పంతో ఎస్బీఐ తన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రాంచీ ప్రారంభించిన అనంతరం ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా ఉండటానికి ఇతర బ్యాంకులకు సమస్యలు ఉంటే, ఎస్‌బీఐ కన్వీనర్‌గా వ్యవహరిస్తుందని అన్నారు. దిస్కిత్‌లో శాఖను ఏర్పాటు చేయడానికి మూడు నెలల ముందే ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలకు సహకరించాలనే నిబద్ధతను ఎస్‌బీఐ కలిగి ఉందని కుమార్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ( జమ్మూకాశ్మీర్, లడఖ్‌ ) విభజించింది.