Hyderabad: నిరుద్యోగ యువతకు లేదా, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి కోసం వారి అర్హతలకు తగినట్లుగా సులభంగా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని తెలుసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అప్లికేషన్ ను సిద్ధం చేసింది. డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ ( DEET APP) పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. మోసపూరిత ప్రకటనలతో నిరుద్యోగులు నష్టపోకుండా, యువతకు ఉపాధి కల్పన కల్పించాలనే లక్ష్యంతో దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ఐటీ, కార్మిక శాఖ ఈ ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది.
ఉద్యోగార్థులు తమ స్మార్ట్ ఫోన్ లో DEET APP ను ఇన్‌స్టాల్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాలి. ఏ సెక్టార్ లో ఉద్యోగాన్ని అణ్వేషిస్తున్నారు, గతంలో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా, సాలరీ ఎంతవరకు ఆశిస్తున్నారు అనే ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకొని ఎక్స్‌పీరియన్స్ మరియు ఉద్యోగ నైపుణ్యతకు సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాలి, అలాగే విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్స్‌ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన రిజల్ట్స్, నోటిఫికేషన్స్ వస్తాయి.
డేటా ఎనాలిటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్‌లో నిక్షిప్తం చేయబడిన ఉద్యోగార్ధుల వివరాలు నేరుగా కంపెనీ రిక్రూటర్లతో అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి ఏదైనా కంపెనీకి ఉద్యోగులు కావాల్సి వచ్చినపుడు నేరుగా వారే ఉద్యోగార్థులకు కాంటాక్ట్ చేస్తారు. ఈ ఫేక్ కంపెనీలు, ఫేక్ ఉద్యోగ ప్రకటనల నుంచి ఉద్యోగార్థులు బయటపడవచ్చు.