ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి సాయంత్రం 3.30–4.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరాన్ని దాటింది.ఆపై ఈ వాయుగుండం మళ్లీ పశ్చిమ బెంగాల్‌లో తీరంలోని దిఘా సమీపంలోకి ప్రవేశించి కోల్‌కతాకు తూర్పున 120 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ గురువారం నాటికి బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి బులెటిన్‌లో తెలిపింది.
ఇది గంటకు 25 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నదని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మి.మీ, హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మంగళవారం నుంచి ఐదురోజులపాటు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.