Hyderabad, December 27: పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) లను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 28, శనివారం రోజున హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ 'మిలియన్ మార్చ్' (Million March) నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే అందుకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అనుమతి నిరాకరించారు. జేఏసీ ప్రతినిధుల బృందం శుక్రవారం మరోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసి, సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా కవాతు (anti-CAA, NRC protest)నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని, తమ అభ్యర్థనను పున:పరిశీలించాలని కోరారు. అయినప్పటికీ సీపీ అందుకు అంగీకరించలేదు. శనివారం నగర పరిధిలో ఎవరికీ ఎలాంటి సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతి ఇవ్వలేదని, ప్రజలు ఫేక్ వార్తలను నమ్మవద్దని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.
"28-12-2019న నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్ లేదా అంబేద్కర్ విగ్రహంతో సహా హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కడా ఊరేగింపు, నిరసన ర్యాలీ, మార్చ్ లేదా బహిరంగ సభకు అనుమతి ఇవ్వబడలేదు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రజలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందే ఫేక్ వార్తలకు, దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలి" అని హైదరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
Here's HYD Police Statement:
Press Release from CP office
Hyd city police has not given permission for any rally, march or procession for 28 December. Please don’t get carried away by any fake news, rumours or propaganda .
Anjani Kumar IPS
CP Hyderabad.
— Hyderabad City Police (@hydcitypolice) December 27, 2019
అయితే, భారతీయ జనతా పార్టీ (బిజెపి) యొక్క సైద్ధాంతిక మూలం అయిన రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఇటీవల హైదరాబాద్‌లో భారీ ర్యాలీ మరియు సమావేశం నిర్వహించింది. ఆ ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి అనుమతి ఎలా మంజూరు చేశారు, ఇప్పుడు సిఎఎ వ్యతిరేక నిరసనకు మాత్రం అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారని జేఏసీ నాయకులు నిలదీస్తూ పోలీసుల మరియు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఏదిఏమైనా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్యాంక్ బండ్ వద్ద తమ నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.