LPG Cylinder Price Hike Again: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.76 పెంపు, ప్రస్తుత ధర రూ.733.50, సబ్సిడీ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు
LPG cylinder price hiked for third month today. Check latest rates(Photo-Wikimedia)

Hyderabad, November 2: మధ్యతరగతి ప్రజలకు నవంబర్ 1వ తేదీ షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరుగుదల నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇదిలా ఉంటే నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తోంది. తాజాగా సిలిండర్‌పై రూ.76 పెంచడంతో నగరంలో సిలిండర్‌ ధర రూ.733.50కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగుతుండడంతో గ్యాస్‌పై ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో కేవలం నాలుగు నెలల్లో రూ.105.50 పెరిగినట్లయింది. గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన సిలిండర్ ధరను మారుస్తూ ఉంటాయి.

ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.681.50గా ఉంది. ఈ ధర ఢిల్లీలో వర్తిస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.706గా, ముంబైలో రూ.651గా, చెన్నైలో రూ.696గా ఉంది. సాధారణంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తారీఖున మారుతూ ఉంటుంది. సిలిండర్ ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా మూడో నెల కావడం ఆసక్తికర అంశం. అక్టోబర్ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్ నెలలోనూ ఎల్‌పీజీ ధర రూ.15.5 పైకి కదిలింది. కాగా గతేడాది ఇదే నెలలోని గ్యాస్ సిలిండర్ ధరతో పోలిస్తే ఇప్పుడు ధర ఏకంగా రూ.250 దిగువున ఉందని చెప్పుకోవచ్చు. గతేడాది నవంబర్ నెలలో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.939గా ఉంది. ఇకపోతే జూలై, ఆగస్ట్ నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మొత్తంగా రూ.163 దిగొచ్చిన విషయం తెలిసిందే.

అయితే సబ్సిడీ సిలిండర్‌ ధరలో మాత్రం మార్పు లేదు. పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్‌ వినియోగదారులపై నయా పైసా అదనపు భారం ఉండదు. గృహవినియోగదారులు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్‌ తీసుకుంటే వారికి వచ్చే సబ్సిడీ తర్వాత బ్యాంక్‌ ఖాతాలో జమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది. వీటిని అదనంగా సిలిండర్ కావాలంటే మార్కెట్ ధర చెల్లించాలి.