Mumabi, November 1: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది. అయితే బీజెపీ మాత్రం అయిదేళ్లు మేమే సీఎంగా ఉంటాం. మీకు 16 మంత్రి పదవులిస్తాం అని చెబుతోంది. దీంతో ఇప్పట్లో సీఎం పీఠముడి అక్కడ వీడేలా లేదు. ఈ నేపథ్యంలో ఓ రైతు నన్ను సీఎంగా చేయమంటూ ముందుకొచ్చాడు. కొనసాగుతున్న ‘మహా’ సస్పెన్స్, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలు
వివరాల్లోకెళితే.. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో సీఎం సీటు కోసం బీజేపీ-శివసేన మల్లగుల్లాలు పడుతుండటంపై మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాడు. ఈ నేపథ్యంలో తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి శ్రీకాంత్ విష్ణు గడాలే అనే రైతు లేఖ రాశారు. ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు నాశనం అయ్యాయని పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తుల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ఆదుకోవడానికి ప్రభుత్వం లేకపోవడంపై శ్రీకాంత్ లేఖలో ఆవేదనను తెలియజేశాడు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన, బీజేపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో ఆ పార్టీల సమస్య తీరేంత వరకు ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలని శ్రీకాంత్ విష్ణు గడాలే కోరారు. ముఖ్యమంత్రిగా రైతుల సమస్యలను తాను తీరుస్తానని, వారికి న్యాయం చేకూరుస్తానని చెప్పారు.
రైతు రాసిన లెటర్ ఇదే
'Make Me Maharashtra CM': Distressed Beed Farmer Has Perfect Solution to BJP-Sena Row pic.twitter.com/lc2L5uByB3
— Vihar Wikipedia (@ViharWikipedia) November 1, 2019
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పవార్ తో చర్చించినట్లు సంజయ్ రౌత్ తెలిపారు.
శివసేన నాయకులు నిన్న శరద్ పవార్ తో భేటీ తర్వాత మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(MPCC)నాయకులు బాలాసాహెబ్ తోరట్,అశోక్ చవాన్,పృధ్విరాజ్ చవాన్,విజయ్ వాడెట్టివర్,మానిక్ రావ్ ఠాక్రే లు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు.
సోనియాగాంధీతో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు భేటీ
Senior Maharashtra Pradesh Congress Committee (MPCC) leaders Balasaheb Thorat, Ashok Chavan, Prithviraj Chavan, Vijay N Wadettiwar, Manikrao Thakre to meet Congress Interim President Sonia Gandhi in Delhi today. pic.twitter.com/DMITcY4Yqg
— ANI (@ANI) November 1, 2019
మరోవైపు ఢిల్లీ ముందు మహారాష్ట్ర తలవంచందు అంటూ శరద్ పవార్ నివాసానికి దగ్గర్లో,ముంబైలో పలుచోట్ల బ్యానర్లు కన్పిస్తున్నాయి.