Elections | Image used for representational purpose | (Photo Credits: PTI)

Manipur, March 05: ఐదు రాష్ట్రాల ఎన్నికలు (5 States Election) చివరిదశకు చేరుకున్నాయి. యూపీలో(UP Election) ఏడు దశల్లో ఇప్పటికీ ఆరు దశలు పూర్తయ్యాయి. మరొక దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అటు మణిపూర్ (Manipur)లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తికాగా.. శనివారం ఉదయం 7 గంటలకు తుదిదశ (Final Phase) పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు (Security) ఏర్పాటు చేశారు. మొత్తం 1247 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ లో పలువురు ప్రముఖుల భవితవ్యం తేల్చుకోబోతున్నారు. ఈ దఫా బరిలో మాజీ సీఎం ఇబోబిసింగ్(Ibobi singh), మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్ గాంగ్ మీ తదితరులున్నారు.

ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన మొదటి దశ పోలింగ్ లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ స్టేషన్ లో రీ పోలింగ్ కు ఎన్నికల అధికారులు ఆదేశించారు. రీ పోలింగ్ కూడా కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్(Naga peoples Front), జనతాదళ్ తదితర పార్టీలు సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.

UP Elections: వారికోసం బల్డోజర్లు సిద్ధం చేస్తున్నాం, యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు, మార్చి 10 తర్వాత సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్, ఎస్పీ-బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం, హీటెక్కిన ఎన్నికల ప్రచారం

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థులకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. మణిపూర్ లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్ 54, జేడీయూ 38, ఎన్పీపీ 42 సీట్లలో అభ్యర్థులను దింపాయి. గత ఐదేళ్లలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. మణిపూర్‌లో పార్టీ లోపల బలమైన లాబీతో ఐదేళ్లుగా కూటమిని నడిపించగలిగారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్ చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. తృణముల్ కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మరో చోట విజయం సాధించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కాదని… ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం గమనార్హం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.