MI vs RCB Highlights: బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ముంబై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ, ఫ్లేఆఫ్‌‌లోకి ఎంట్రీ
Suryakumar Yadav and Jasprit Bumrah (Photo Credits: PTI)

ముంబై ఇండియన్స్ మరోసారి సత్తా చాటింది, అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ఆటను కనబరుస్తూ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఫ్లేఆఫ్ లోకి ప్రవేశించింది. ఐపీఎల్ 13వ సీజన్‌లో ఫ్లేఆఫ్‌కు వెళ్లిన తొలిజట్టుగా ముంబై నిలిచింది. మరోవైపు బెంగళూరు ఆడిన గత రెండు మ్యాచ్‌లోనూ వరుసగా ఓడిపోయి, ఇప్పటికీ ప్లేఆఫ్ గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. అయితే లీగ్ స్టేజ్‌లో ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. RCB జట్టులో ఒపెనర్లు ఇద్దరు మాత్రమే రాణించారు, మిగతా బ్యాట్స్‌మెన్ మొత్తం చేతులెత్తేశారు. RCB స్కోర్ చేసిన మొత్తం 164 పరుగుల్లో ఒపెనర్ల భాగస్వామ్యమే 107 పరుగులు ఉంది. 24 బంతులు ఆడిన ఒపెనర్ ఫిలిప్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 పరుగులు చేయగా, మరో ఒపెనర్ దేవదత్ పడిక్కల్ 45 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో మొత్తం 74 పరుగులు చేసి అదరగొట్టాడు. RCB జట్టులో పడిక్కల్‌దే అత్యధిక స్కోరు.

కెప్టెన్ కోహ్లీ 9, డివిలియర్స్ కేవలం 15 పరుగులే చేసి నిరాశపరిచారు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా ఆ మాత్రం పరుగులు చేయటానికి చాలా కష్టపడ్డారు. ముంబై బౌలర్లలో బూమ్రా నిప్పులు చెరిగాడు. 4 ఓవర్లు వేసిన బూమ్రా 3 వికెట్లు పడగొట్టి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు, ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. బౌల్ట్, రాహుల్, కెప్టెన్ పొలార్డ్‌లు కూడా చెరో వికెట్ తీశారు.

ఇక 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కూల్‌గా బ్యాటింగ్ చేసింది. ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే వన్‌మ్యాన్ ఆర్మీలాగా దృఢంగా నిలబడ్డాడు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు అజేయంగా నిలిచిన సూర్యకుమార్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ దూకుడుతో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చివరి బంతికి విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు

ఆర్సీబీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. వికెట్లేమి తీయకపోయినా, కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్లెవరు ఆకట్టుకోలేదు. 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి డెయిల్ స్టెయిన్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక గురువారం దుబాయ్ వేదికగా చెన్నై మరియు కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.