New Delhi, March 3: రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Pariament Budget Session 2020) కొనసాగుతున్నాయి. ఈశాన్య దిల్లీ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్ల ఘటనలకు సంబంధించి మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. దిల్లీ అల్లర్లపై (Delhi Riots) చర్చ జరపాలని లోకసభ మరియు రాజ్యసభలో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్షాల నిరసనలలో చట్టసభల్లో గందరగోళం నెలకొంది, దీంతో లోక్ సభను కొద్దిసేపు వాయిదా తిరిగి ప్రారంభించారు, మరోవైపు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
ఇక,పార్లమెంటు సమావేశం ప్రారంభం కావడానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (BJP) పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో శాంతి సామరస్యాలు, మరియు ఐక్యత నెలకొల్పాలని సహచర మంత్రులకు ప్రధాని సూచించారు. బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాల కన్నా, దేశ ప్రయోజనాలే ముఖ్యం అని మోదీ పేర్కొన్నారు.
దేశ అభివృద్దే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుంది అని, అయితే అందుకు శాంతియుత వాతావరణం ఉండాలి అని ప్రధాని కోరుకుంటున్నారని పార్లమెంట్ సభావ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. "దేశమే మా సుప్రీం, అభివృద్ధి మా మంత్రం" అని జోషి అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సహాయ మంత్రి జితేంద్ర సింగ్, పార్టీ చీఫ్ జెపి నడ్డా ఉన్నారు.
ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో 46 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పార్లమెంట్ వేదికగా గత రెండు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, దిల్లీ ఘర్షణలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు లోక్‌సభలో 23 వాయిదా తీర్మానాలు ఇచ్చారు. షాక్ నుంచి ఇంకా తేరుకోని ఈశాన్య ఢిల్లీ వాసులు
అయితే, అందుకు అంగీకరించని అధికార పక్షం పార్లమెంటులో చర్యల ద్వారా మతపరంగా రెచ్చగొట్టడానికి, ఉద్రిక్తతలను మరింత పెంచడానికి కాంగ్రెస్ మరియు దాని మిత్ర పక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార బీజేపి ఎదురుదాడికి దిగింది.
ప్రతిపక్షానికి చెందిన నేతలే వీధుల్లో అల్లర్లు సృష్టించి, ఇక్కడ పార్లమెంటులో చర్చలు అంటున్నారని, దిల్లీ హింసాకాండ వెనక ఉన్న సంఘ విద్రోహ శక్తులందరికీ శిక్ష పడుతుంది అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి అన్నారు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఏ చర్చకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని. శాంతి, సామరస్యాల స్థాపనే మా ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.