PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, December 10: దిల్లీలో నూతన పార్లమెంట్ పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాప‌న చేశారు.

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వివిధ మ‌త గురువుల‌తో బహుళ మత ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అలాగే వేద పండితులు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వ‌హించారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనే పేరుతో రూ. 971 కోట్ల వ్యయంతో  ఈ కొత్త పార్ల‌మెంట్ కార్యాల‌యాన్ని నిర్మించ‌నున్నారు. ఇప్పుడున్న పార్లమెంట్ భవనానికి ఆనుకొనే ఈ భవన నిర్మాణం జరగనుంది. 2022, ఆగ‌స్టు 15 నాటికి ఈ భవనాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.  ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణ బాధ్యతలను టాటా గ్రూప్ సంస్థలకు అప్ప‌గించారు. ఈరోజు జ‌రిగిన భూమిపూజ‌, శంకుస్థాన కార్య‌క్ర‌మానికి టాటా గ్రూప్ సంస్థల అధినేత ర‌త‌న్ టాటా కూడా హాజ‌ర‌య్యారు. అలాగే  లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు

పాల్గొన్నారు.  ప్ర‌స్తుతం ఉన్న పార్ల‌మెంట్ భ‌వ‌నంకు నిర్మాణ ప‌నుల‌ను 1921లో ప్రారంభించారు. ఆరేళ్లకు 1927లో ఆ భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యింది.  కాగా, సెంట్ర‌ల్ విస్టా భ‌వనాన్ని ఏడాదిన్నర కాలంలోనే  పూర్తి చేయనున్నారు. భార‌తీయ సంస్కృతి ప్ర‌తిబింబిచేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఈరోజు పునాది రాయి వేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 'ఆత్మనిర్భర్ భారత్ సృష్టికి ఇది పునాది అవుతుంది' అని వ్యాఖ్యానించారు.

Watch PM Modi's Speech Here:

ఆయన మాట్లాడుతూ.. "స్వాతంత్య్రం తర్వాత దేశానికి దారిచూపిన ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్ల క్రితం నిర్మించింది.  అది దేశ ప్రజాస్వామ్య అవసరాలను తీర్చింది. ఇప్పుడు నిర్మించబోయే నూతన భవనం 21వ శతాబ్దానికి చెందిన భారత్‌కు సేవలందిస్తుందని. దేశ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేరుస్తుందని, ఈ భవనం ఆత్మనిర్భర్ భారత్ స్థాపనకు పునాది అవుతుంది" అని మోదీ పేర్కొన్నారు.

నూతగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వం ఉట్టిపడే ఉండే ఒక ఘనమైన సెంట్రల్ హాల్, అలాగే పార్లమెంటు సభ్యుల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన ప్రదేశాలు మరియు తగినంత పార్కింగ్ స్థలం ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉభయ సభల్లో సభ్యుల సీటింగ్ సామర్థ్యం పెంచారు.  దిగువ సభ అయిన లోక్‌సభకు 888 మంది సభ్యులకు కూర్చునే సామర్థ్యం ఉండే ఛాంబర్‌ మరియు ఎగువ సభ అయిన రాజ్యసభలో 384 సీట్లు ఉండనున్నాయి.