New Delhi, Dec 11: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరిదశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బాంబు పేల్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని (no possibility of any alliance) స్పష్టం చేశారు.
ఆప్-కాంగ్రెస్ (AAP-Congress)ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్‌కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. 1-2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించనున్నట్లు పేర్కొనగా, వాటిని తాజాగా కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సొంత బలంతో ఎన్నికల్లో గెలుపొందుతుంది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకూ అవకాశం లేదు’ అని కేజ్రీ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన అభ్యర్థులతో కూడిన రెండు జాబితాలను ఆప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశ రాజధాని ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రానున్న ఎన్నికల కోసం పార్టీని ముందుకునడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆప్ నేత ఆతిశీ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.