Ranchi, June 10: బాలికపై అత్యాచారానికి (Rape)పాల్పడిన ఇద్దరు యువకులపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా(Gumla) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదార్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై పక్క గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బుధవారం రాత్రి అత్యాచారం (Rape) చేశారు. అయితే తనపై జరిగిన లైంగికదాడిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కలిసి పక్క గ్రామానికి వెళ్లి ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం బాధితురాలి గ్రామానికి తీసుకొచ్చి వారిపై దాడి చేశారు.
ఆగ్రహించిన గ్రామస్తులు సదరు యువకులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి బైక్‌ను కూడా తగులబెట్టారు. ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.