![](https://test1.latestly.com/wp-content/uploads/2022/06/Shalini-Victim-Honour-Killing.jpg)
Mysuru, June 9: కర్ణాటకలో పరువు ప్రతిష్ఠ మాటున ఓ అమ్మాయి హత్యకు (Karnataka Honour Killing) గురైంది. దళిత యువకుడిని ప్రేమించిందనే కోపంతో కన్న కూతురిని కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు. ఈ దారుణం కర్ణాటకలోని పెరియపట్న తాలూకు కగ్గుండి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళ్లహళ్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని సమీప గ్రామం కగ్గుండికి చెందిన అగ్రవర్ణానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి ప్రేమించింది. ప్రేమవ్యవహారం తెల్సి అమ్మాయి తల్లిదండ్రులు కూతురుని తీవ్రంగా మందలించారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది.
తల్లిదండ్రులతో కలిసి ఉండబోనని అమ్మాయి తెగేసి చెప్పడంతో పెరియపట్న పోలీసుల సూచన మేరకు అమ్మాయిని రెండు నెలల క్రితం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వసతిగృహంలో ఉంచామని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ హెచ్‌టీ కమల చెప్పారు. గొడవలు లేవని, ఇక ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో రెండు వారాల క్రితం అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఇంటికెళ్లిన కొద్దిరోజుల్లోనే హత్యకు (17-Year-Old Girl Blamed Her Parents for Death) గురవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తల్లిదండ్రులే ఆమెను చంపేశారని, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులే బైక్ మీద ఊరి అవతలికి తీసుకెళ్లి పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాకే హత్య పూర్తి వివరాలు చెప్పగలమని ఎస్పీ చేతన్ అన్నారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌చేశారు.