Chhattisgarh Accident: పెళ్లికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి, చత్తీస్‌గఢ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం భూపేష్‌
Chhattisgarh Accident (PIC@ ANI Twitter)

Raipur, May 04: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బాలోద్‌ (Balod) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి కాంకేర్‌ జాతీయ రహదారిపై (Kanker National Highway) జగత్రా (Jagatra)వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో (Bolero) వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి బొలేరో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ దవాఖానకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు. మృతులంతా ధామ్‌తరి (Dhamtari ) జిల్లాలోని సోరెమ్‌ భట్‌గావ్‌ గ్రామంలో నివాసముండే ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు.

వీరంతా కాంకేర్‌ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ చెప్పారు. కాగా, ప్రమాద ఘటనపై సీఎం భూపేశ్‌బగేల్‌ (CM Bhupesh Baghel) ట్విట్టర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రమాదంలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు.