New Delhi, Sep 17: కరోనాకు విష జ్వరాలు తోడయ్యాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో డెంగీ, వైరల్ జ్వరాల జోరుతో 100 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వేలాదిమంది పిల్లలకు, పెద్దలకు డెంగీ, వైరల్ జ్వరాలు (Fatal Fevers) ప్రబలాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,500 మందికి డెంగీ జ్వరాలు సోకాయి.డెంగీ జ్వరాలతో 100 మంది (100 deaths due to fatal fevers) మరణించారు.
దీంతో డెంగీ ప్రబలటానికి కారణమైన దోమల నివారణకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జబల్ పూర్ పట్టణంలో ఎయిర్ కూలర్లపై నిషేధం విధించింది. జబల్‌పూర్ పట్టణంలో దాదాపు 3000 జ్వరం కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వందలాదిమంది జ్వరాల బారిన పడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో వైరల్ జ్వరం వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. భోపాల్, ఇండోర్, జబల్ పూర్, అగర్ మాల్వా, రత్లం జిల్లాల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా దాదాపు 1200 మంది పిల్లలు జ్వరం, శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఉత్తర బెంగాల్‌లో జ్వరాలతో ఇద్దరు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బీహార్ రాష్ట్రంలో పిల్లలకు న్యూమోనియా కేసులు పెరిగాయి. పిల్లల ఆసుపత్రులు రోగులతో నిండాయి. హర్యానాలో వైరల్ ఫీవర్ అనేక మంది చిన్నారుల ప్రాణాలను బలిగొంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం కొందరు పిల్లలు న్యుమోనియా, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వల్ల మరణించారు.హర్యానాలోని పాల్వాల్ జిల్లాలోని చిల్లీ అనే చిన్న గ్రామంలో గత రెండు వారాల్లో 8 మందికి పైగా చిన్నారులు వైరల్ జ్వరాలతో మరణించారు.