Gurugram, Sep 1: చట్టాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఆడవాళ్లపై అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా దేశ రాజధానిలో ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా అంటే ఏమీ లేదు. అక్కడ మహిళలపై కామాంధులు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని నరేలా ( Narela) ప్రాంతానికి చెందిన బాలిక(13) (13-Year-Old Dalit Girl ) పొరుగునే ఉన్న గుర్‌గావ్‌లో అత్యాచారం, హత్యకు (Raped and Killed) గురైంది.
ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని బంధువే రేప్ చేసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా తమ కుమార్తె దహన సంస్కారాలు వెంటనే పూర్తి చేయాలంటూ యజమాని బంధువు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఆమె తండ్రి తెలిపిన కథనం ప్రకారం.. సోదరుడి భార్య ప్రసవించడంతో సాయం చేయడానికంటూ మా యజమానురాలు నా కుమార్తెను జూలై 17న గుర్‌గావ్‌కు పంపారు.
ఆ తరువాత నా కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం మా యజమాని నాకు ఫోన్ చేసి చెప్పారు. రాత్రి 7 గంటల సమయంలో మృతదేహాన్ని నరేలాలోని మా ఇంటికి తీసుకువచ్చారు. వెంటనే దహన సంస్కారాలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశారని బాలిక తండ్రి పోలీసులకు తెలిపారు. యజమానురాలి సోదరుడు ప్రవీణ్ వర్మ, ఇతరులు కలిసి తన కుమార్తెను చంపారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు.
హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో గుర్‌గావ్ పోలీసులు వివిధ సెక్షన్లతోపాటు ఎస్‌సీ/ఎస్‌టీ చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ (Adhir Urges HM to Ensure Justice) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే.