Jammu Kashmir, June 30: పార్వతీ దేవికి పరమశివుడు అమర రహస్యం చెప్పిన ప్రదేశం అది. ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్లి గుహలోకి ప్రవేశించినా ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటారు భక్తులు. ఎంత కష్టమైనా భరిస్తూ అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) చేస్తుంటారు. మూడేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. మొదటి బ్యాచ్(First batch) ముక్కంటి సన్నిధికి ప్రయాణం మొదలు పెట్టింది. కశ్మీర్ లోయలో (Kashmir Valley) పవిత్ర అమర్నాథ్ యాత్ర మొదలైంది. హిమాలయాల్లో కొలువైన పవిత్ర మంచు శివలింగాన్ని(Shivlinga) దర్శించుకునేందుకు తొలి బ్యాచ్ భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. దాదాపు 5వేల మందితో కూడిన మొదటి బ్యాచ్ యాత్రను జమ్మకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Lt. Manoj sinha) జెండా ఊపి ప్రారంభించారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా అమర్నాథ్ యాత్రకు (Amarnath Ytra) కేంద్రంతో పాటు స్థానిక యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది హిమ లింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రభుత్వం భావిస్తోంది. తొలి బ్యాచ్‌లో 4వేల 890 మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి బ్యాచ్ జమ్ముకశ్మీర్‌లోని బాల్తాల్ బేస్ (Balthan Base) క్యాంపునకు చేరుకుంటుంది. అక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర గుహకు తొలి బ్యాచ్ పయనం అవుతుంది. గుహను చేరుకోవడానికి సుమారుగా 5-8 గంటల సమయం పడుతుంది.
మరోవైపు, ఈ యాత్రను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు (Terrorist)కుట్ర పన్నుతున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కూంబింగ్ పెంచారు. దాదాపు 80 వేల మంది సైనికులు అమర్నాథ్ యాత్ర కోసం పహారా కాస్తున్నారు. అలాగే డ్రోన్లు, సీసీ కెమెరాలతో అమర్నాథ్ యాత్రా మార్గాలపై నిఘా ఉంచారు.
యాత్రికులందరినీ రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ల ద్వారా ట్రాక్(Track) చేస్తున్నారు. శునకాలతో అమర్నాథ్ యాత్రా మార్గాలను జల్లెడపుతున్నారు. యాత్రా మార్గంలో ఎలాంటి వాహనాలు కూడా ఆగకుండా నిషేధం విధించారు. యాత్రికులు ఆధార్ కార్డులు (Aadhar cards), ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలని అధికారులు ఆదేశించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వర్చువల్ గా మంచు లింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ క్షేత్రానికి చేరుకునేందుకు మూడు రోజుల సమయం పడుతుంది. గురువారం నుంచి ప్రారంభమైన యాత్ర 43 రోజులపాటు కొనసాగి, ఆగస్టు 11న ముగియనుంది. కాగా.. కరోనా (Corona) కారణంగా మూడేళ్లుగా భక్తులకు యాత్రకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మూడేళ్ల తర్వాత మళ్లీ అనుమతించడం వల్ల భారీగా యాత్రికులు తరలివచ్చారు. యాత్రలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు 70 పడకల ఆస్పత్రిని బల్తాల్ బేస్ క్యాంపు వద్ద ఏర్పాటు చేశారు. 135 అంబులెన్సులు సిద్ధం చేశారు. స్వచ్ఛ అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా పరిశుభ్రతపై దృష్టి సారిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ వెల్లడించారు.
ఆర్టికల్ 370 రద్దుతో 2019లో అమర్‌నాథ్ యాత్ర మధ్యలోనే రద్దయ్యింది. తర్వాత కరోనా వ్యాప్తి పెరగడంతో 2020, 2021ల్లోనూ యాత్ర చేపట్టలేదు. ప్రస్తుతం కొవిడ్ నియంత్రణలో ఉండడంతో ఈ యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హిందువులకు అమర్‌నాథ్ ఒక ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రం. అమర్‌నాథ్ గుహ దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3వేల 880 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడకు నేరుగా రహదారి లేదు. భక్తులు కాలినడకన పర్వతం ఎక్కడం ద్వారా పైకి వెళ్లాలి. ఇది చాలా రోజులు పడుతుంది. మంచు కొండల్లో కొలువుదీరిన అమరనాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.