Eknath Shinde and Devendra Fadnavis Take Oath as CM and Deputy CM (Pic Credit-ANI)

Mumbai, June 30: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే (Eknath Shinde), ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis as His Deputy) చేశారు. దీంతో.. ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది. 1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్‌నాథ్ షిండే ఎంట్రీ ఇచ్చారు. శివసేనలో చేరి కార్పొరేటర్‌గా గెలిచారు.

ఉద్దవ్‌ సర్కార్‌ను కుప్పకూల్చిన శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని (Eknath Shinde Takes Oath as Maharashtra Chief Minister) దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్‌ అయ్యారు.1964 ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్‌ షిండే జన్మించారు. యశ్వంతరావు వాన్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

వేయ్ చిందేయ్.. గోవాలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ వీడియో వైరల్, సీఎంగా రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే నేడు ప్రమాణ స్వీకారం

తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మాస్ లీడర్‌గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్‌నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. ఇక.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.