Income Tax Filing (Photo Credits: Pixabay)

New Delhi, February  2: సార్వత్రిక బడ్జెట్ వేతనజీవుల ఆశలకు గండికొట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్లో వ్యక్తిగత పన్నుల విషయంలో పెద్ద మార్పులను ప్రకటించలేదు. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, పిపిఎఫ్ పరిమితి, సెక్షన్ 80 సి మినహాయింపులో మార్పులు లేవు.

సీనియర్ సిటిజన్లకు మాత్రం కొంత ఉపశమనం కలిగించారు. 75 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు ఎవరైతే పెన్షన్ మరియు వడ్డీ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉంటారో వారికి ఐటీఆర్ ఫైల్ చేయటం నుంచి మినహాయింపునిచ్చారు.

సరసమైన గృహాలకు వడ్డీ చెల్లింపుపై రూ .1.5 లక్షల తగ్గింపును మరో ఏడాది వరకు పొడగించటం ద్వారా కొత్తగా చిన్న ఇల్లు కొనుక్కోవాలనే వారికి కొంత ఊరట లభించినట్లయింది.

కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, జీతాల్లో కోతలు విధించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వీరంతా ఉన్నదాంట్లోనే పొదుపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది ఇన్ కాం టాక్స్ నుంచి కొన్ని రాయితీలు, మినహాయింపులు ఉంటాయని భావించారు. అయితే అలాంటిదేమి జరగకపోగా 2.5 లక్షల వార్షిక పీఎఫ్ చెల్లింపులకు వచ్చే వడ్డీపై అదనపు టాక్సు వసూలు చేయనున్నారు.

గత సంవత్సరం ఆదాయపు పన్ను పథకంలో ఈ క్రింది పన్ను స్లాబ్‌లు ఉన్నాయి..

సంవత్సరానికి రూ .5 లక్షల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను ఉండదు.

సంవత్సరానికి రూ .5 లక్షల నుండి 7.5 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ .7.5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 15 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ .10 లక్షల నుండి 12.5 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 20 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ 12.5 లక్షల నుంచి రూ .15 లక్షల మధ్య ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 25 శాతం ఉంటుంది.

సంవత్సరానికి రూ .15 లక్షలకు పైబడిన ఆదాయానికి, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 30 శాతం ఉంటుంది.