New Delhi, January 25: ఢిల్లీలో రేపు జరగనున్న రైతు ర్యాలీని హింసాత్మకం చేసేందుకు పాకిస్థాన్ కు చెందిన ట్విట్టర్ హ్యాండ్లర్స్ రంగంలోకి దిగారని ఢిల్లీ పోలీసు వర్గాలు గుర్తించాయి. వ‌్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రిపబ్లిక్ డే (Republic Day Parade) నాడు ఢిల్లీలో రైతులు నిర్వహించనున్న ట్రాక్టర్ల ప్రదర్శనను (Disrupt & Hijack Tractor Rally)హైజాక్ చేసేందుకు, అంతరాయం కలిగించేందుకు పాకిస్థాన్‌లో 308 ట్విట్టర్ ఖాతాలు ( Pakistan Twitter profile) పని చేస్తున్నాయని ఢిల్లీ ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ కమిషనర్ దీపేంద్ర పాథక్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు అడ్డంకులు కల్పించడమే వారి ఉద్దేశమని అన్నారు. మంగళవారం రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాత పటిష్ఠ భద్రత మధ్య రైతుల ట్రాక్టర్ల పరేడ్ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ స్పెషల్ కమిషనర్ తెలిపారు.
"మొత్తం 300కు పైగా ట్విట్టర్ ఖాతాలను (300 Twitter Handles From Pakistan) గుర్తించాం. ఇవన్నీ పాకిస్థాన్ లో పుట్టినవే. జనవరి 13 నుంచి 18 మధ్య ఇవి యాక్టివ్ అయ్యాయి. ప్రజలను, ముఖ్యంగా రైతులను తప్పుదారి పట్టించడమే వీరి లక్ష్యం. ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగేలా చూడటం మా ముందున్న పెద్ద సవాలే" అని ఆయన అన్నారు. ఈ విషయమై వివిధ నిఘా సంస్థల నుంచి తమకు సమాచారం అందిందన్నారు. పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఆపరేట్ అవుతున్న ఈ ట్విట్టర్ ఖాతాలు 'సపోర్ట్ ఖలిస్థాన్' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నాయని, కొన్ని ఖాతాలు విభిన్న దేశాల నుంచి నడుస్తున్నాయని కూడా గుర్తించామని ఆయన అన్నారు.
పాక్ అధికారిక రేడియో చానెల్ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తోందని దీపేంద్ర తెలిపారు. పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ సెక్రెటరీ జనరల్, పాకిస్థాన్ సెనెట్ కార్యదర్శి ఖుర్రమ్ నవాజ్ గండాపూర్, ప్రముఖ జర్నలిస్ట్ మొహమ్మద్ షఫీక్ తదితరులు దీన్ని వాడుతూ ట్వీట్లు పెడుతున్నారని తెలిపారు.
దీంతోపాటుగా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందని దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. సంఘ విద్రోహ శక్తులు శాంతిభద్రతల సమస్యను క్రియేట్ చేసే ముప్పు ఉందన్నారు. రైతుల నిరసనలు, ట్రాక్టర్ల ర్యాలీలకు పాకిస్థాన్‌కు చెందిన 308 ట్విట్టర్ హ్యాండిల్స్ హ్యాచ్‌టాగ్స్ జత చేశాయన్నారు. వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.