Chennai, FEB 04: ఉచిత చీరల పంపిణీలో (saree distribution) నెలకొన్న తొక్కిసలాటలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో పది మంది గాయపడ్డారు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న విషాదం ఇది. జిల్లాలో ఓ పండగను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ఉచిత చీరల పంపిణీలో (stampede) ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో మురుగన్ తైపూసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఓ ప్రైవేటు కంపెనీ ఉచితంగా ధోతీలు, చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం నేడు టోకెన్లు జారీ చేయగా.. వీటిని తీసుకునేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి కొందరు మహిళలు కిందపడిపోయారు. మిగతావారు వారిపైనుంచి వెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 10 మంది గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు.