New Delhi, JAN 05: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog In Delhi) కప్పేస్తోంది. దృశ్య గోచరత తగ్గిపోవడంతో 51 రైళ్లు, 100కి పైగా విమాన సర్వీసులు రీషెడ్యూల్ (Flights Reschedule) చేశారు. పాలెం విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి 7.30 గంటల వరకూ దృశ్య గోచరత జీరోకు (Delhi Visibility) వచ్చేసిందని, చలిగాలులు గంటకు 8-13 కి.మీ వేగంతో వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారి (IMD) ఒకరు చెప్పారు. శనివారం తొమ్మిది గంటల జీరో దృశ్య గోచరత నుంచి ఆదివారం 3.5గంటల జీరో దృశ్య గోచరతకు దిగి వచ్చిందని ఆ అధికారి తెలిపారు. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 18.6డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, ఇది సాధారణ స్థాయి కంటే తక్కువ అని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఢిల్లీ, అమృత్‌సర్, చండీగఢ్, కోల్‌కతా, లక్నో నగరాల మధ్య తిరిగే విమాన సర్వీసులపై ప్రభావం పడింది. దేశంలోనే అత్యధిక విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో ఆదివారం తెల్లవారుజామున 12.59 గంటలకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెడుతూ విమానసర్వీసుల ఆలస్యం వల్ల తలెత్తిన ఇబ్బందుల పట్ల విచారం వ్యక్తంచేసింది. తమ వెబ్‌సైట్ లేదా యాప్‌ను సందర్శించి ప్రత్యామ్నాయ విమాన సర్వీసుల గురించి తెలుసుకోవాలని కోరింది. రోజూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 1300 విమాన సర్వీసులు నడుపుతోంది.