Mumbai, NOV 13: మహారాష్ట్ర ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Chhatrapati Shivaji Maharaj International Airport) కస్టమ్స్ అధికారులు రూ.32కోట్ల విలువైన 61 కిలోల బంగారాన్ని (Gold) స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఈ కేసుల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకొని, మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బంగారం సీజ్ చేయడం ఇదే తొలిసారని కస్టమ్స్ (Customs) అధికారులు తెలిపారు. టాంజానియా నుంచి భారత్‌కు చెందిన నలుగురు ప్రయాణికులను అడ్డగించి తనిఖీలు చేయగా.. నడుము బెల్టుల్లో బంగారం బిస్కెట్లు (Gold Biscuits) పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. నలుగురు వ్యక్తుల నుంచి 53 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.28.17కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Maharashtra | On 11th November, Mumbai Airport Customs seized 61 kg gold valued at Rs 32 crores and arrested seven passengers in two separate cases pic.twitter.com/uTCmbnhvgV
— ANI (@ANI) November 13, 2022
నలుగురు ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దోహా నుంచి ముంబైకి వచ్చారని పేర్కొన్నారు. నలుగురు విమానంలో వచ్చిన సూడాన్ దేశస్తుడు బంగారాన్ని ఇచ్చినట్లు సదరు వ్యక్తులు తెలిపారు. నలుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
అలాగే దుబాయి నుంచి విస్తారా విమానంలో వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.3.88కోట్ల విలువైన ఎనిమిది కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికులు జీన్స్ ప్యాంట్‌ల నడుము భాగంలో బంగారాన్ని పౌడర్ రూపంలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వివరించారు.