
Bihar, April 09: బీహార్‌లోని (Bihar) రోహ్‌తాస్ (Rohtas district) జిల్లాలో వింత రీతిలో దొంగతనం జరిగింది. 60 అడుగుల స్టీల్ వంతెనను (Steel bridge) దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానిక అధికారులను, గ్రామస్థులను బురిడీ కొట్టించి పట్టపగలు ఈ వంతెనను దొంగిలించుకెళ్లిపోయారు (Stolen). నీటిపారుదలశాఖ అధికారులం అని చెప్పి, గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మెషిన్లు ఉపయోగించి 3 రోజుల్లో మొత్తం వంతెనను కూల్చేశారని తెలిపారు. ఈ వంతెన తొలగించడానికి స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు, గ్రామస్తుల సహకారం తీసుకోవడం ఆసక్తికరం. భారీగా ఐరన్ లూటీ చేసిన దొంగలు పరారయ్యారని కాసేపటి తర్వాత గానీ అధికారులకు అర్థం కాలేదు. మూడు రోజుల పాటూ సాగిన ఈ లూటీపై స్థానిక పోలీసులు కూడా అప్రమత్తం కాలేకపోయారు. అయితే ఇదంతా అధికారుల సాయంతోనే జరిగిందా? అనే అనుమానం కూడా వస్తోంది. దొంగల ప్లాన్ అర్ధమయిన తర్వాత గ్రామస్తులు కూడా ముక్కున వేలేసుకున్నారు. వాళ్ల చేతిలో మోసపోయినందుకు నీటిపారుదల అధికారులు కూడా అవాక్కయ్యారు. తాము ఎలాంటి ముందస్తు అనుమతి పత్రాలు చూడకుండా బ్రిడ్జిని తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వడంపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
A gang of thieves managed to steal a 60-feet defunct iron bridge in #Bihar's Rohtas district in broad daylight - and with the help of unwitting local officials and villagers, an official said. pic.twitter.com/hqEcUshs09
— IANS (@ians_india) April 8, 2022
అమియావార్ గ్రామంలో నస్రిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్రాహ్ కెనాల్‌పై 1972లో ఈ వంతెన నిర్మించారు. ఆ వంతెన పూర్తిగా పాత పడిపోవడంతోపాటు ప్రమాదకరంగా మారింది. భయంతో స్థానిక గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామవాసులు వాడటం మానేశారు. పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనను వినియోగించడం మొదలుపెట్టారు.
నీటి పారుదలశాఖ విభాగం అధికారుల నుంచి ఫిర్యాదు అందిందని నస్రిగంజ్ ఎస్‌హెచ్‌వో సుభాష్ కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. దొంగలను గుర్తించడానికి స్కెచ్‌లు వేసి.. స్క్రాప్ మెటీరియల్ విక్రయించే వారితో కాంటాక్ట్ అయ్యారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వంతెన 60 అడుగుల పొడవు 12 అడుగుల ఎత్తు ఉంటుందని తెలిపారు.