Kolkata, March 10: గతంలో కన్యాదానం, మావిడాకులు, అభిషేకం, సుల్తాన్, బావగారు బాగున్నారా.. లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించిన రచన బెనర్జీ (Actress Rachna Banerjee) ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తుంది. బెంగాలీ భామ అయిన రచన బెనర్జీ బెంగాలీలో దాదాపు 50కి పైగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1992 నుంచి 2010 వరకు బెంగాలీతో (Bengali) పాటు తెలుగు, ఒడియా, తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా టీవీలో యాంకర్ గా, జడ్జిగా బెంగాలీ షోలలో కనిపిస్తుంది. ఈ అమ్మడు అచ్చు బెంగాలీ అమ్మాయి. కలకత్తాలోనే పుట్టి పెరిగింది. బెంగాల్ లోని మమతా బెనర్జీ (Mamatha Benarjee) తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీలో ఇటీవల చేరింది రచన.
త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికలకు మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించగా రచన బెనర్జీకి హూగ్లీ నియోజకవర్గం ప్రకటించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో రచన బెనర్జీ హూగ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనుంది. ఇటీవలే రచన బెనర్జీ హోస్ట్ గా చేస్తున్న దీదీ నెం1 షోకి (Didi No.1) మమతా బెనర్జీని తీసుకెళ్లి సందడి చేసింది. ఆ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు మమతా పార్టీలో ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకోవడం గమనార్హం. మరి గెలుస్తుందో ? ఓడుతుందో చూడాలి.