మహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు వారి మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అగ్నివీరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ (Artillery Centre)లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సదరు అధికారులు తెలిపారు.
ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో గురి తప్పి ఆ బుల్లెట్లు గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21) శరీరంలోకి దూసుకెళ్లినట్లు చెప్పారు. అగ్నివీర్ బృందం వారిని వెంటనే డియోలాలిలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు అగ్నివీరులు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై డియోలాలి క్యాంపు పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.