New Delhi, September 20: విపక్షాల నిరసలన మధ్యే వ్యవసాయ బిల్లులు (Agricultural Reform Bills) రాజ్యసభ ముందుకు వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం ఉదయం రెండు వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో (Rajya Sabha) ప్రవేశపెట్టారు. వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమని, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు పునాది పడతాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీతో ఈ బిల్లులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని తోమర్ తెలిపారు
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు (Bills Moved To Rajya Sabha Amid Protests) తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోలానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే లోక్‌సభలోఈ బిల్లులు ఆమోదం పొందిన విషయం విదితమే.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఒబెరాయ్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపేశారు. మైక్‌లను సైతం విరిగగొట్టారు. రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మీరేమో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2028 నాటికి గానీ రైతుల ఆదాయం రెట్టింపు కాదు. ఇలాంటి వాగ్దానాలపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. మీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలేవీ? నాలుగు నిబంధనల్లో కనీస మద్దతు ధర అనేది ఓ అంశం మాత్రమే. మేము ఆ నాలుగు అంశాలనూ వ్యతిరేకిస్తున్నాం. కేవలం కనీస మద్దతు ధరను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్న ప్రచారాన్ని చేయకండని విమర్శించారు.
Here's ANI Tweet
Rajya Sabha: Opposition MPs in the well of the House raise slogans; Rajya Sabha Deputy Chairman Harivansh asks them to return to their seats pic.twitter.com/eBp194zrjQ
— ANI (@ANI) September 20, 2020
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రయత్నాన్ని తామెన్నడూ సఫలం కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాహుల్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవసాయ బిల్లుల్లో కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేకపోతుందంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు.
రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఓడించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాలకు పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని రైతులందరి చూపూ రాజ్యసభ వైపే ఉంది. రాజ్యసభలో అధికార పక్షం మైనారిటీ. ఎన్డీయేతర పక్షాలన్నీ ఐకమత్యమై, ఈ మూడు బిల్లులను ఓడించాలి. ఈ పరిణామాన్నే దేశంలోని రైతులు కోరుకుంటున్నారు’’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
ఈ బిల్లులు రైతులను బానిసలుగా మారుస్తాయి. కార్పొరేట్ శక్తులకు రైతులు బానిసలవుతారు. జీడీపీలో రైతుల భాగస్వామ్యం 20 శాతం. ఈ బిల్లులు రైతుల ఉసురు తీసుకునేవి. రైతులను ఆట వస్తువులుగా మార్చేస్తాయని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు.
కేంద్రం వైఖరి చూస్తుంటే ఈ బిల్లులపై ఎలాంటి చర్చ చేపట్టకూడదన్నట్లుంది. కేవలం పరుగో పరుగు అన్నట్లుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కనీసం రైతు నేతలతో, ప్రతిపక్షాలతో చర్చించలేదు. కనీసంలో కనీసం ఆరెస్సెస్ అనుబంధ రైతు సంఘంతోనూ సంప్రదించలేదు. గత ఆరు సంవత్సరాలలో జీడీపీలో వ్యవసాయ సహకారం 6 శాతం ఎందుకు తగ్గిపోయింది? ఆలోచించారా? అని
సమాజ్ వాదీ ఎంపీ రాం గోపాల్ యాదవ్ ఫైర్ అయ్యారు.
మేము ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం. తమ జీవితాలపై దాడి చేయడానికే కేంద్రం ఈ బిల్లులను తెచ్చిందని పంజాబ్, హర్యానా రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును ఆమోదించడమంటే రైతుల మరణ శాసనంపై సంతకం చేయడం లాంటిదేనని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింహ బాజ్వా అన్నారు.
ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలి. దీంతో అన్ని పక్షాల వారూ దీన్ని వినవచ్చు. పంజాబ్ రైతులు బలహీనులని భావించకండని శిరోమనీ అకాలీదళ్ ఎంపీ నరేశ్ కుమార్ గుజ్రాల్ అన్నారు.