New Delhi, November 13: భారతదేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది, మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఈ ఏడాది పండగలన్నీ ఆంక్షల మధ్య జరుపుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం దేశంలో కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి, దీపావళి పండగ నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం, ఇతర కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగానే పాటిస్తే కొవిడ్ ను అదుపులో ఉంచవచ్చు, లేనిపక్షంలో డిసెంబర్, జనవరి నాటికి కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. కొవిడ్ వ్యాప్తి, వాతావరణ కాలుష్యం నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు.
భారత్‌లో కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 44,878 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 87,28,795కు చేరింది. నిన్న ఒక్కరోజే 547 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,28,688కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,079 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 81,15,580 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజులోనే ఆక్టివ్ కేసుల సంఖ్య 4,747 తగ్గింది. దీంతో ప్రస్తుతం దేశంలో 4,84,547 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
📍#COVID19 India Tracker
(As on 13 November, 2020, 08:00 AM)
➡️Confirmed cases: 87,28,795
➡️Recovered: 81,15,580 (92.97%)👍
➡️Active cases: 4,84,547 (5.55%)
➡️Deaths: 1,28,668 (1.47%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafe
Via @MoHFW_INDIA pic.twitter.com/E7HkzZriKI
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) November 13, 2020
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 92.97% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 5.55% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.47% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక నవంబర్ 11 వరకు దేశవ్యాప్తంగా 12,31,01,739 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,93,230 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు 85,583కు చేరగా, కొవిడ్ మరణాలు 45,682కు పెరిగాయి. దీని తర్వాత కేరళలో ప్రస్తుతం 77,931 ఆక్టివ్ కేసులుండగా, దిల్లీలో43,116 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.