Air India Express aircraft crash (Photo Credits: ANI)

Kozhikode, August 07 : కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి కేరళ వస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన  IX 1344 ఫ్లైట్ కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో  రన్‌వేపై జారుతూ రెండు ముక్కలుగా విరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ మరియు కోపైలైట్ సహా మొత్తం 17 మంది వరకు మృతి చెందగా, 120 మందికి పైగా గాయాలయ్యాయని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 15 మందికి తీవ్రమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తాజా నివేదికలు తెలిపాయి.

ప్రమాదం జరుగుతున్న సమయంలో విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు ఉండగా అందులో 174 మంది పెద్దలు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. విమాన సిబ్బందిలో అందరూ దుర్మరణం పాలయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి 20 అంబులెన్సులు చేరుకున్నాయి. విమానంలోని ప్రయాణికులందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించే వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ విమానం భారతీయ ప్రయాణికులను స్వదేశానికి చేరవేస్తుంది.

Dubai-Calicut Air India Flight Skidded During Landing:

Visuals Outside  Karipur Airport:

రాత్రి 7:40 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో రన్‌వేపై పూర్తిగా నీరు వచ్చి చేరింది, అదే సమయంలో ఎయిర్ ఇండియా విమానం కూడా చేరుకుంది. అయితే పైలెట్లు ఇద్దరు కూడా విమానాన్ని ల్యాండ్ చేయడానికి సందేహం వ్యక్తం చేశారు. విమానాశ్రయం చుట్టూ పలు మార్లు గాల్లోనే చక్కర్లు కొడుతూ రెండు సార్లు ల్యాండ్ చేయటానికి ప్రయత్నాలు చేసినట్లు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 నివేదిక తెలిపింది. ఇక ఎట్టకేలకు ల్యాండింగ్ చేస్తుండగా రన్‌వేపై సర్రున జారింది, ఈ క్రమంలోనే ఆ వేగానికి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు తీవ్రమైన భయభ్రాంతులకు లోనైనట్లు తెలిసింది. ఈ భయంతోనే కొంత మంది  ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

కాగా, ఈ ప్రమాదంపై డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదం జరగటానికి రన్ వే నిర్మాణం, నిర్వహణ లోపమే కారణమని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

ప్రమాద ఘటన తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర కేబినేట్ మంత్రులు, కేరళ సీఎం పినరయి విజయన్ ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.