New Delhi, April 18: దేశంలో ప్రస్తుతం అమలు చేయబడుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగిసే తర్వాతి రోజు నుంచి బుకింగ్స్ ప్రారంభించింది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India). మే 4 నుంచి దేశీయంగా ఎంపిక చేసిన రూట్లలో టికెట్ బుకింగ్స్ స్వీకరిస్తున్నామని, అలాగే జూన్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా బుకింగ్స్ స్వీకరణ ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. అయితే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఇంతలో ఏదైనా మార్పులు ఉంటే సమాచారం అందిస్తామని పేర్కొంది.
దేశంలో కరోనావైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సేవలను ఎయిర్ ఎండియా నిలిపివేసింది. అయితే COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్ధతుగా అవసరమైన ఔషధాలు మరియు వైద్య పరికరాలను తీసుకురావడానికి, లాక్డౌన్ కారణంగా భారతదేశంలో చిక్కుకున్న విదేశీ పౌరులను తరలించడానికి, ఇతర దేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను స్వదేశానికి తీసుకురావడానికి, ఇతరత్రా కార్యక్రమాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడుపుతోంది.
Update by ANI:
Air India opens bookings for select domestic flights May 4th 2020 onwards and International Flights June 1st, 2020 onwards pic.twitter.com/Lsz9gRLF9V
— ANI (@ANI) April 18, 2020
మరోవైపు లాక్డౌన్ కొనసాగే వరకు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రైవేట్ క్యారియర్‌లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ విమానయాన సంస్థల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా మే4 తర్వాత బుకింగ్స్ స్వీకరిస్తుండటంతో అదే బాటలో ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా అనధికారికంగా బుకింగ్స్‌కు అనుమతిస్తున్నాయి.
ఇప్పటికే ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ ఆంక్షల విధింపులో హాట్ స్పాట్ కాని ప్రాంతాలలో కొన్ని సడలింపులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా మే 03 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఆ లోపు దేశంలో కోవిడ్-19 తీవ్రత తగ్గుతూ పోతే పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.