Delhi November 06: దేశరాజధానిని కాలుష్యం కమ్మేసింది. ప్రతీఏటా కాలుష్యం కారణంగా 15 లక్షల మంది మరణిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. అంతేకాదు ఢిల్లీవాసుల ఆయుష్షు సగటున 9.5 సంవత్సరాలు తగ్గుతుందని డేటా చెప్తోంది. ముఖ్యంగా హస్తినలో గత మూడు రోజులుగా వాయునాణ్యత సూచీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా దట్టమైన పొగ కమ్ముకుంటోంది.
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ స్థాయిలో వాయుకాలుష్యం పెరిగితే మావన మనుగడకు ముప్పు తప్పదంటున్నారు. ముఖ్యంగా కన్నౌట్ ప్యాలెస్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 654, జనతా మందిర్ వద్ద 341 కు చేరింది. ఇదే విధంగా మరికొద్దిరోజులు కొనసాగితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తీవ్రమయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు
వాయుకాలుష్యం కారణంగా ప్రతీఏటా 15 లక్షల మంది చనిపోతున్నారని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని ప్రజల జీవితకాలం సగటున తొమ్మిదిన్నర ఏళ్లు తగ్గుతుందని, ఢిల్లీలో జన్మిస్తున్న ప్రతీ ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి ఆస్తమా సమస్య ఏర్పడుతుందని ఆందోళన చేశారు పర్యావరణ వేత్త విమలెందు జా.
గత మూడు, నాలుగు రోజులుగా నగరంలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గాలినాణ్యత సూచీ మరింతగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై సగటున గాలి నాణ్యత 533 పాయింట్లుగా ఉంది. కాలుష్యం కారణంగా చాలా మంది కళ్ల మంటలు, గొంత నొప్పితో ఇబ్బందులు పడుతున్నార. గాలిలో పెరిగిన దుమ్ము, దూళితో విజుబులిటీ తగ్గి నగరాన్ని చీకటి కమ్మేసింది.
ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్ధాలను తగులబెడుతూనే ఉన్నారు రైతులు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పంట వ్యర్ధాల దగ్ధంతో కాలుష్యం మరింత తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం కేవలం ఈ సీజన్‌లో మాత్రమే చర్యలు చేపట్టడం, మిగిలిన రోజుల్లో వాయుకాలుష్యంపై పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటుందోని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.