New Delhi, December 10: సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2012వ సంవత్సరం డిసెంబర్ 16న అర్ధరాత్రి దేశ రాజధాని దిల్లీలో జరిగిన అత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని 'నిర్భయ' (Nirbhaya)ను నడుస్తున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, మానవత్వాన్నే మరిచి ఆ యువతి పట్ల అత్యంత నీచమైన చర్యలకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటనలో కొన్నిరోజుల పాటు ప్రాణాలతో పోరాడిన నిర్భయ డిసెంబర్ 29న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిని దోషులుగా (Six Convicts) తేల్చిన న్యాయస్థానాలు శిక్షలు కూడా ఖరారు చేశాయి. ప్రస్తుతం వీరు దిల్లీ తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే వీరిలో ఒకడు బాల నేరస్థుడు కాగా, మరొకడు రామ్ సింగ్ అనే వ్యక్తి 2013లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురు వినయ్ శర్మ (Vinay Sharma), అక్షయ్ సింగ్ ఠాకూర్ (Akshay Singh Thakur), ముఖేశ్ సింగ్ మరియు పవన్ గుప్తాలు కారాగారంలో ఉన్నారు.
కాగా, నిర్భయపై దారుణానికి పాల్పడిన రోజైన డిసెంబర్ 16వ తేదీనే దోషులకు ఉరిశిక్ష విధించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ శిక్ష నుంచి తప్పించుకునేందుకు వారికి ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో దోషులు తాము ఇంకా బ్రతకాలనే ఆశతో చావు తెలివి తేటలు చూపిస్తున్నారు. ఆ దోషుల్లో వినయ్ శర్మ అనే వాడు చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అతడి క్షమాభిక్షను తిరస్కరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు దిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫారసు చేశాయి. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉంది. తక్షణమే న్యాయం జరగాలంటే అది సాధ్యపడదు- సుప్రీకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే
ఇదిలా ఉండగా, మరో దోషి అక్షయ్ సింగ్ ఠాకూర్ తన ఉరిశిక్షను పున: సమీక్షించాలని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. మిగతా ముగ్గురి రివ్యూ పిటిషన్లను సుప్రీం ఇదివరకే తిరస్కరించింది. గతంలో రివ్యూ కోరని అక్షయ్, సమయం చూసి తాజాగా సుప్రీంలో రివ్యూ పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే ఆ పిటిషన్ లో విచిత్రమైన కారణాలు పేర్కొంటూ తన శిక్షను తగ్గించాలని కోరడం గమనార్హం. దిశ కేసులో న్యాయ వ్యవస్థ కాదు, పోలీసు తూటా తీర్పు చెప్పింది.
దిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం ఉందని, అది తన జీవితాన్ని తగ్గిస్తోందని, కాబట్టి తనకు ప్రత్యేకంగా మరణశిక్ష అవసరం లేదని అక్షయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దిల్లీలో పీల్చేగాలి కలుషతమే, అలాగే తాగే నీరు కూడా విష తుల్యమే. దిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు, అదీకాక మనుషుల జీవితం కూడా చాలా చిన్నది. ఇలాంటి సందర్భంలో ఇక మరణ శిక్ష ఎందుకు అనే ప్రశ్నను తన పిటిషన్ లో లేవనెత్తాడు. ఇలా నిర్భయ దోషులు తమ ఉరిశిక్షను యావజ్జీవంగా తగ్గించాలంటూ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.