రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)-నీతా అంబానీ (Nita Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్-శైల దంపతుల కుమార్తె రాధిక మర్చంట్(Radhika Merchant)తో అనంత్ వివాహం నిశ్చయమైంది.
రాజస్థాన్ నాథ్‌ద్వారలోని శ్రీనాథ్‌జీ(Shrinathji) ఆలయంలో అనంత్-రాధిక నిశ్చితార్థం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు ఇద్దరూ భగవాన్ శ్రీనాథ్‌జీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే, ఆలయంలో నిర్వహించిన రాజ్-భోగ్ శ్రింగార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంత్-రాధిక మధ్య ఇదివరకే పరిచయం ఉంది. గత కొన్నేళ్లుగా ఇద్దరు ఒకరికొకరు తెలుసు. అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎనర్జీ బిజినెస్‌ను చూసుకుంటున్నారు. రాధిక న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ డైరెక్ట్‌గా ఉన్నారు.