New Delhi, August 27: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి (YS Jagan) సోమవారం రోజున మావోయిస్ట్ ప్రాబల్య రాష్ట్రాలతో అమిత్ షా (Amit Shah) నిర్వహించిన కీలక భేటీలో పాల్గొన్నారు. ఇక పనిలో పనిగా ఏపిలోని తాజా పరిస్థితులపై మరియు రాజధాని అంశంలో నెలకొన్న అనిశ్చితిపై అమిత్ షాతో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. గత కొద్ది కాలంగా రాజధాని మార్పు విషయంలో వైసీపీ ముఖ్య నాయకులు పలు లీకులు ఇస్తూనే పోతున్నారు, సీఎం జగన్ అమెరికా పర్యటన ముగించుకొని రాగానే రాజధాని మార్పు విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టనున్నారని 'లేటెస్ట్‌లీ' కొన్నిరోజుల ముందే క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు అందరి ఊహాగానాలు నిజమే అనేటట్లుగా రాజధాని మార్పు అంశంపై సీఎం జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అమరావతిని కేవలం పాలనాపరమైన వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా వైసీపీ వర్గాల నుంచి సమాచారం కొద్దికొద్దిగా బయటకు వస్తుంది.
ఏపి రాజధానిని ఒక చోట మాత్రమే పరిమితం చేయకుండా విజయనగరం, కడప, కాకినాడ మరియు గుంటూర్ (అమరావతి) కేంద్రాలుగా వివిధ వ్యవహారాల వారీగా రాజధానిని వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రం నలువైపులా అభివృద్ధి సాధ్యపడుతుంది అని జగన్ కేంద్ర పెద్దల వద్ద ఒక ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తుంది.
ఇక మరోవైపు పోలవరం అంశంపై కూడా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో సీఎం జగన్ చర్చించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ఎందుకు చేపట్టామో కేంద్రమంత్రికి సీఎం జగన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం వాదనలు విన్న గజేంద్ర షెకావత్ , ప్రాజెక్ట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పోలవరంపై రివర్స్ టెండరింగ్ పై ఏపీ హైకోర్ట్ స్టే ఇస్తూ వెలువరించిన తీర్పును సైతం ఏపీ ప్రభుత్వం సవాలు చేయాలనుకుంటుంది.
ఇలా రాజధాని, పోలవరం తదితర అంశాలపై ఇక్కడ టీడీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏపిలో తమకు తోచిన విమర్శలు చేస్తుంటే సీఎం జగన్ మాత్రం ఇక్కడ నాయకులను, ఆరోపణలను పట్టించుకోకుండా నేరుగా ఢిల్లీ నుంచి కథ నడిపిస్తున్నాడు. త్వరలోనే రాజధాని అంశంపై ఏదో ఒక ప్రకటన మాత్రం వెలువడబోతుంది.