New Delhi, June 30: విచ్చలవిడిగా భూగర్భ జలాలను (Ground water) వినియోగిస్తుండటంతో కేంద్రం ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయాల్లో భూగర్భ జలాలను వినియోగించుకుంటున్న వారు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర జల్‌శక్తిశాఖ (JalShakthi Ministery) మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (national Green Tribunal) మార్గనిర్దేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లోని నివాస సముదాయాలు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, ప్రభుత్వ నీటి సరఫరా ఏజెన్సీలు, పారిశ్రామిక, మౌలికవసతుల కల్పన, మైనింగ్ ప్రాజెక్టులు, బల్క్ వాటర్ సప్లయ్ ఏజెన్సీలు భూగర్భ జలాల వినియోగానికి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (CGWA) నుంచి ఎన్వోసీని పొందాలని, ఎన్‌వోసీ పొందని సంస్థలు భూగర్భజలాలను వినియోగించుకొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు ఎన్‌వోసీ పొందేందుకు జూన్ 30వ తేదీ చివరి తేదీ అని చెప్పింది.
గురువారం లోగా ఎన్‌వోసీ (NOC) కోసం పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని, సెప్టెంబర్ 30లోగా పూర్తిస్థాయి దరఖాస్తును సమర్పించాలని పేర్కొన్నది. వివరాలకు cgwa.noc. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలను అనుమతి లేకుండా వాడుకుంటున్నారు.
ఒక నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 76 శాతం బోర్లకు అనుమతి లేదని, ఇలా అనేక ప్రాంతాల్లో పర్మిషన్లు లేకుండా భూగర్భ జలాలను వినియగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కఠిన చర్యలను తీసుకోవాలని భావించిన కేంద్ర జల్‌శక్తి మిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.