Bareilly, March 18: భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సహోద్యోగిపై ఒక ఆర్మీ జవాన్ (Army jawan) రగిలిపోయాడు. అతడి భార్యను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో (Bareilly) ఈ సంఘటన జరిగింది. ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్ నితీశ్ పాండే (Nitish Pande) తెలుసుకున్నాడు. దీంతో సహోద్యోగి అయిన సేనాపతిపై (Senapathi) రగిలిపోయాడు. ఈ నెల 13న ఆ జవాన్ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో సేనాపతి ఇంట్లో లేడు. దీంతో సేనాపతి గురించి అతడి భార్య సుధేష్ణను అడిగాడు. ఫోన్ చేసి అతడ్ని పిలువాలని చెప్పాడు. అలాగే తన భార్య, సేనాపతి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. అతడి మొబైల్ ఫోన్‌లో ఉన్న తన భార్య ఫొటోలు, వీడియోలు తొలగించాలని సేనాపతితో చెప్పాలన్నాడు.
కాగా, ఈ సందర్భంగా సేనపతి భార్య సుధేష్ణ, నితీశ్ పాండే మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన అతడు తన వెంట తెచ్చిన సైనికులు వినియోగించే కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడ, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలు కావడంతో ఆమె మరణించింది. అనంతరం నితీశ్ పాండే అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతి భార్య సుధేష్ణ హత్య గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడైన మరో జవాన్ నితీశ్ పాండేను గుర్తించారు. మిలటరీ పోలీసుల సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు దాచిన హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.