
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (EC) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు (Assembly Election Results 2022) వెలువడుతున్న గురువారం నాడు పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు (EC lifts ban on victory processions) ప్రకటన విడుదల చేసింది. అయితే, ఎస్‌డీఎంఏ ఆదేశాలు, జిల్లా అధికారుల ఆంక్షలకు అనుగుణంగానే సడలింపులు ఉంటాయని పేర్కొంది.
దీనికి ముందు, కోవిడ్ కారణంగా విజయోత్సవ ర్యాలీలతో సహా ఇతర ఎన్నికల అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రమంగా కోవిడ్ పరిస్థితులు మెరుగుపడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల నిబంధనలను ఈసీ సడలిస్తూ వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరుగుతుండటం, ఫలితాలు వెలువడుతుండటంతో గెలుపు దిశగా పయనిస్తున్న పార్టీలు సంబరాలకు సిద్ధం అవుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో విజేతలు వేడుకలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం వల్లే విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అంతకుముందు కరోనా మహమ్మారి కారణంగా విజయోత్సవ వేడుకలపై నిషేధం విధించామని, ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఈ ఆంక్షలను సడలించామని తెలిపింది.