New Delhi, Oct 8: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly elections) ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే (Kondeti Kiran Survey).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly elections) ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఫెయిలైంది. హర్యానాలో ఆ సర్వే అంచనాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఏపీ ఎన్నికలపై కేకే సర్వే కచ్చితమైన అంచనాలను వెల్లడించింది. ఆ సర్వే చెప్పినట్లుగానే ఏపీలో కూటమికి 160 సీట్లు వచ్చాయి.
తాజాగా హర్యానా ఎన్నికలపై కూడా కొండేటి కిరణ్‌కు చెందిన సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. హర్యానాలో 65కుపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని కేకే సర్వే చెప్పింది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వదని.. బీజేపీ టైటానిక్ షిప్‌లాంటిదని కేకే చెప్పారు. హర్యానాలో ప్రతి మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండింట ఓడిపోతుందన్నారు.
అయితే ఫలితాలు సర్వేకు విరుద్ధంగా వచ్చాయి.ఆయన చెప్పిన దానికంటే విభిన్న ఫలితాలు ఆ రాష్ట్రంలో వచ్చాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. అక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. కానీ రానురాను బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 36 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. ఆరు స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక్కడ ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది.