Nagpur, June 16: ఓ వ్యక్తి నగదు విత్ డ్రా (Money Withdraw) చేసుకునేందుకు ఏటీఎంకు (ATM) వెళ్లాడు. కానీ ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఐదు రెట్లు అధికంగా నగదు వచ్చింది. ఈ విషయం జనాలకు తెలియడంతో.. ఆ ఏటీఎం వద్ద నగదు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur) జిల్లాలోని ఖపర్‌ఖేడా పట్టణంలోని ఓ ఏటీఎం వద్దకు నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అతనికి రూ. 500 అవసరం ఉండటంతో.. అంతే నగదు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ రూ. 500లకు బదులుగా రూ. 2,500 వచ్చాయి. మళ్లీ రూ. 500 విత్ డ్రా చేశాడు. మళ్లీ రూ. 2,500 వచ్చాయి. ఈ విషయాన్ని ఆ వ్యక్తి అక్కడున్న వారికి చెప్పడంతో క్షణాల్లోనే వందల మంది ఏటీఎం వద్ద గుమిగూడారు. నగదు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు.
ఈ విషయం పోలీసులకు చేరడంతో.. హుటాహుటిన ఆ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఏటీఎంను మూసివేయించారు. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు పోలీసులు. సాంకేతిక సమస్యల కారణంగానే విత్ డ్రా చేసిన నగదు కంటే ఎక్కువగా వస్తుందని బ్యాంకు అధికారులు వెల్లడించారు.