Colombo, AUG 07: కీలకపోరులో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో (3rd ODI) భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక 110 పరుగుల భారీ తేడాతో (Srilanka Won) విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో లంక కైవసం చేసుకుంది. తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), వాషింగ్టన్ సుందర్ (30), విరాట్ కోహ్లీ (20), రియాన్ పరాగ్ (15) మినహా మిగిలిన బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. జెఫ్రీ వాండర్సే, మహేశ్ తీక్షణలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అవిష్క ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టాడు. అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (96; 102 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కుశాల్ మెండిస్ (59; 82 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ బాదగా పాతుమ్ నిస్సాంక (45; 65బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
Sri Lanka spinners produce a stirring display to seal series win 💥#SLvIND 📝: https://t.co/GdDOldBmam pic.twitter.com/RO3zrrhbgE
— ICC (@ICC) August 7, 2024
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిస్సాంక అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పంత్ క్యాచ్ అందుకోవడంతో నిస్సాంక ఔట్ అయ్యాడు. అయితే.. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మెండీస్‌తో కలిసి అవిష్క ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడు బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 65 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత జోరు పెంచాడు. అయితే.. సెంచరీకి చేరువైన అతడిని రియాన్ పరాగ్ బుట్టలో వేశాడు. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. వన్డేల్లో రియాన్ పరాగ్‌కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఆ తరువాతి ఓవర్‌లో చరిత్ అసలంక (10)ను రియాన్ వెనక్కి పంపాడు.
ఈ దశలో భారత బౌలర్లు చెలరేగారు. సదీర విక్రమార్క (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. జనిత్ (8)ని వాషింగ్టన్ సుందర్, దునిత్ వెల్లలాగే (2)ని రియాన్ పరాగ్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న కుశాల్ మెండిస్.. కుల్‌దీప్ ఔట్ చేయడంతో శ్రీలంక 250 పరుగులు దాటలేదు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.