భారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్ చరిత్రలో కనుమరుగై పోయింది. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం (Axis-Citibank Deal) చేస్తున్నట్లు ప్రకటించింది. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్ విలీన ప్రక్రియ (Axis Bank completes acquisition of Citi's India) నేటితో ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న సిటీ బ్యాంక్ అన్ని బ్రాంచీలను ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో విలీనం అయ్యాయి.
యాక్సిస్ బ్యాంకులో విలీన ఒప్పందం 2021కి పూర్తి స్థాయిలో అనుమతులు లభించగా..ఆ తర్వాత నుంచి దశల వారీ ప్రక్రియ చేపట్టారు. నేటితో పూర్తిగా విలీన ప్రక్రియ (Citibank merger with Axis Bank) పూర్తయిపోయింది. తాజాగా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు సిటీ గ్రూపు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్ అకౌంట‍్ల కార్యకలాపాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగనున్నాయి.
అమెరికాకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన సిటీ బ్యాంక్ తన సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది.అయితే ఆర్థిక మాంద్యాల మధ్య గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది.
గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు రూ.11,603 కోట్లకు అమ్ముతున్నట్లు తెలిపింది. యాక్సిస్ బ్యాంక్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత్లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్ సేవల నుంచి తప్పుకుంది.
సిటీ బ్యాంక్‌ను..యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్ యాజమాన్యం తన వెబ్ సైట్‌లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్‌లైన్ ట్రాన్స్‌క్షన్‌లతో పాటు ఇతర అంశాల గురించి కస్టమర్లకు అలర్ట్ మెసేజ్ ఇచ్చింది.
సిటీ బ్యాంక్ కస్టమర్లకు సూచించిన అంశాలు ఇవే..
కస్టమర్లు ఖాతా నంబర్, IFSC / MICR కోడ్‌లు, డెబిట్ కార్డ్, చెక్ బుక్, ఫీజులు, ఛార్జీలలో ఎటువంటి మార్పులు లేకుండా ప్రస్తుతానికి మీ సీటీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడం కొనసాగించవచ్చు.
భవిష్యత్తులో ఏవైనా మార్పులు జరిగితే, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌లకు తెలియజేస్తుంది.ప్రస్తుతం అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.
సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్,క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు.క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్‌లు పొందవచ్చు.
క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు.లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
సిటీ బ్యాంక్‌లో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి.రుణాల కోసం, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది.
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అత్యవసర నగదుగా మీ ఖాతా నుండి తక్షణమే 10,000 డాలర్ల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు అని బ్యాంక్ సూచించింది.
యాక్సిస్ బ్యాంక్ ATMలలో మీరు బ్యాలెన్స్ విచారణ, నగదు ఉపసంహరణ, PIN మార్పు మరియు మొబైల్ నంబర్ నవీకరణ సేవలు పొందవచ్చు.