New Delhi, November 9: దేశ వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసుపై మరికొద్ది క్షణాల్లో చారిత్రాత్మక తీర్పు రాబోతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు సుప్రీంకోర్టు ఈ రోజు చెక్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు. స్కూళ్లకు, కాలేజీలకు, విద్యసంస్థలకు ముందు జాగ్రత్తగా సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్, యూపీ, జమ్ము కశ్మీర్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు. యూపీలో ముందుజాగ్రత్త చర్యగా శనివారం నుంచి సోమవారం వరకూ విద్యాసంస్థలను మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు.
సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు గోవా, యూపీ, జమ్ము కశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. భోపాల్, బెంగళూర్‌లలో నిషేధాజ్ఞలు విధించారు.
దేశ వ్యాప్తంగా హై అలర్ట్
Security heightened in #Ayodhya ahead of the verdict in Ayodhya land dispute case today; Section 144 (prohibits assembly of more than 4 people in an area) has been imposed in the state of Uttar Pradesh. pic.twitter.com/XTw8rhTyfm
— ANI (@ANI) November 9, 2019
బెంగళూర్‌లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో పరీక్షలు వాయిదా వేసిన అధికారులు శనివారం మద్యం విక్రయాలు ఉండవని డ్రైడేగా ప్రకటించారు.
ఇక హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను నియమించామని, హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.